పెళ్లై ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మంచి వృత్తి, హాయిగా సాగిపోతున్న సంసారంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. గురువారం రోజున పౌర్ణమి ఉన్నందున కుటుంబ సమేతంగా కారులో తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో...
ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడమే జీవితం అంటారు. తాజాగా చోటు చేసుకున్న ఓ ప్రమాదం చూస్తే.. ఈ మాటలు నిజమే అనిపిస్తాయి. అంత సవ్యంగా సాగిపోతున్న జీవితంలో.. రెప్పపాటులో జరిగిన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. పెళ్లై ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మంచి వృత్తి, హాయిగా సాగిపోతున్న సంసారంలో అనుకోని ఘటన.. కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. కొన్నిసార్లు విహార యాత్రలు.. విషాద యాత్రలుగా మిగులుతున్నాయి. దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందగా.. అందులో ఇద్దరు నూతన దంపతులు ఉండటం విచారకరం. ఈ ఘటన తిరువణ్ణామలైలో చోటు చేసుకుంది.ఆ పూర్తి వివరాలు ఇలా..
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్ సీపీ గురుకులం సమీపంలో ఒరుగు దయాసాగర్ రెడ్డి(58), మధుమతి(53) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకి సూర్యతేజరెడ్డి(33) కుమారుడు ఉన్నారు . సూర్య డాక్టర్ చదివి.. చిత్తూరు అపోలో ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. సూర్యతేజరెడ్డికి ఏడాది క్రితమే మౌనిక(29)తో వివాహమైంది. మౌనిక కూడా విజయనగరంలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నారు. గురువారం రోజున పౌర్ణమి కావడంతో కుటుంబ సమేతంగా కారులో తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లారు. గిరి ప్రదక్షిణలో పాల్గొని..తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలోని వారిని బలితీసుకుంది.
తమిళనాడులోని వేలూరు జిల్లా, ఒడుగత్తూరు నుంచి వస్తున్న మిని వ్యాన్ కన్నమంగళం వద్ద కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న దయాసాగర్ రెడ్డి, డాక్టర్ సూర్యతేజరెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. అతని భార్య మౌనిక, మధుమితకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ దగ్గర్లో ఉన్న వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మౌనిక అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మధుమిత పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. నూతన వధూవరులు.. అందులోనూ జీవితంపై ఎన్నో ఆశలతో బతుకుతున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.