ఇటీవల రైలు ప్రయాణాలు బెంబేలు పెట్టిస్తున్నాయి. ప్రయాణీకులకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. ఓ రైలు ప్రయాణీకురాలిపై టీటీఈ యూరిన్ పోసిన ఘటన మర్చిపోక ముందే.. తోటి ప్రయాణీకులతో గొడవ పడి నిప్పంటించాడో వ్యక్తి. ఇప్పడు రైల్వే నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణీకులు.
ఇటీవల రైలు ప్రయాణాలు భయాందోళనకు కలిగిస్తున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్‌లో ఓ రైలు ప్రయాణీకురాలిపై టీటీఈ యూరిన్ పోసిన ఘటన ఎంతటి సంచలనం కలిగించిందే అందరికీ తెలుసు. అలాగే టికెట్ చూపించాలని బెంగళూరులో ఓ మహిళ పట్ల ఓ టీటీఈ దురుసుగా ప్రవర్తించాడు. మొన్నటికి మొన్నకేరళలో. అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో తోటి ప్రయాణికుడితో గొడవపడి ఆగ్రహంతో పెట్రోలు పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఇప్పుడు మరో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులు బెంబేతెత్తిపోయారు. సరైన సౌకర్యాలు కల్పించడంలో రైల్వే నిర్లక్ష్యం వహిస్తుందంటూ నిరసన చేపట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.
విశాఖ పట్నంరైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీల్లో నీళ్లు రాకపోవడంతో పలువురు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విశాఖపట్నం స్టేషన్‌లో రైలును నిలిపి వేశారు. సికింద్రాబాద్ నుండి బయలు దేరిన విశాఖ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం చేరుకున్న 20 నిమిషాల తర్వాత తిరిగి భువనేశ్వర్ వైపు బయల్దేరుతుండగా ప్రయాణికులు గొలుసు లాగి నిలిపేశారు. దీంతో కాసేపు రైలు నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి నీళ్లు రాకపోవడంతో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, అయితే విజయవాడలో నీరు నింపుతామని చెప్పి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ వచ్చిన తర్వాత కూడా నీరు రాలేదని, మళ్లీ ఫిర్యాదు చేస్తే విశాఖపట్నంలో నింపుతారంటూ చెప్పుకొచ్చారని తెలిపారు. వైజాగ్ వచ్చాక కూడా బోగీల్లో నీళ్లు నింపకపోవడంతో అసహనానికి గురైన ప్రయాణీకులు రైలును కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో పలువురు స్టేషన్ అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది వారికి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. నిరసన చేపట్టడంతో 15 నిమిషాల పాటు రైలు విశాఖ స్టేషన్‌లో నిలిచిపోయింది. మరోవైపు రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో విశాఖపట్నంలోనూ నీరు నింపడం సాధ్యపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకుల నిరసన నడుమే రైలు ముందుకు కదిలింది.. రైల్వేశాఖ తీరు, సమన్వయ లేమిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.