మోక్షం కోసం పూజలు చేయడం ఒక ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్ పూజారితో తన్నించుకున్నా కూడా మోక్షం వస్తుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ వింత ఆచారం మన తెలుగు రాష్ట్రంలోదే.
సాధారణంగా భక్తులు మోక్షం పొందడం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం పూజారి కాలితో తన్నితే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆయనతో తన్నించుకుంటేనే గానీ మోక్షం రాదని గట్టి నమ్మకం. అలా తన్నించుకోవాలంటే అదృష్టం ఉండాలని వారు భావిస్తారు. ఈ తన్నుడు కోసం భక్తులు క్యూ కడుతుంటారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ తన్నించుకోవడానికి ఎగబడుతుంటారు. అయితే ఇలా తన్నించుకోవడం వెనుక 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆచారం ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామంలో ఉన్న మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ ప్రసిద్ధ ఆలయంలో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో రథోత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవాల్లో భాగంగా చివరి రోజున శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత భక్తులు ఆలయం ముందు బారులు తీరి ఆలయ పూజారితో తన్నించుకుంటారు. ఆలయ పూజారి స్వామివారి ఉత్సవ విగ్రహాలను నెత్తిన పెట్టుకుని చేతితో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ నిలబడి ఉన్న భక్తులను తన్నుతూ వెళ్లారు. కాలితో తన్నించుకున్న భక్తులు స్వామివారికి పూజలు చేసి వెళ్తారు. ఇలా చేస్తే తమకు మోక్షం కలుగుతుందని నమ్మకం. ఈ ఆచారం 500 ఏళ్లకు ముందే ఉందని పూర్వీకులు చెబుతారు. ప్రతి ఏటా చిన్నహోతూరులో స్వామివారి రథోత్సవాలను మహాయోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించేవాడని చెబుతారు.
ఉత్సవాల చివరి రోజున శివపార్వతుల కళ్యాణం జరిపించేవాడని చెబుతారు అయితే ఒకసారి కళ్యాణ సమయంలో భక్తులు కొన్ని తప్పులు చేయడంతో మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి కుమారుడు వీరభద్ర స్వామికి ఆగ్రహం వచ్చిందట. ఆయన ఆలయ పూజారి రూపంలో తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను తల మీద పెట్టుకుని.. గుడిలో ఉన్న త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ భక్తులను కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో తన్నులు తిన్నవారికి మోక్షం కలిగిందని భక్తులు అంటున్నారు. 500 ఏళ్లకు ముందు నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని భక్తులు అంటున్నారు. తమను తన్నేది పూజారి కాదని.. వీరభద్ర స్వామి అని అంటున్నారు. మరి ఈ ఆచారంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.