ఆంధ్రపదేశ్ విశాఖపట్నం జిల్లా, నర్సిపట్నం ప్రాంతానికి చెందిన కుర్రాడికి కళ్లు చెదిరే ప్యాకేజీతో గూగుల్ లో సాఫ్ట్ వేర్ కొలువు దక్కింది. ఆ వివరాలు.. నర్సిపట్నానికి చెందిన జయంతి విష్ణువ్యాస్ ప్రస్తుతం ఏడాదికి 10 లక్షల వేతనంతో బెంగళూరులోని యాక్సెంచర్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో తాజాగా అతను గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్లాడు. 47.50 లక్షల వార్షిక వేతనంతో లెవల్ 4 సీనియర్ ఇంజనీర్ పోస్ట్ కు సెలక్ట్ అయ్యాడు. మార్చి 7 నుంచి బెంగళూరులో విధులకు హాజరు కావాల్సి ఉంది. విష్ణువ్యాస్ హిమాచల్ ప్రదేశ్ అమీర్ పూర్ నిట్ క్యాంపస్ లో బీటెక్ ఈసీఈ చదివాడు.
ఇదిలా ఉండగా, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న కడపకు చెందిన ఓ కుర్రాడు సంవత్సరానికి 95 లక్షల వార్షిక వేతనంతో అమెరికాలో సాఫ్ట్ వేర్ కొలువుకు సెలక్ట్ అయ్యాడు. రైల్వేకోడూరు సూర్యనగర్‌కు చెందిన ఆదనుకోట యశ్వంత్ ఇంటర్ ఎంపీసీలో 982 మార్కులు సాధించి జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. చివరి సంవత్సరంలోనే టెక్సాస్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న థర్డ్‌ఏఐ కార్ప్ కంపెనీకి యశ్వంత్ ఎంపికయ్యాడు.