ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం.. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. మంచి మనిషి, మృదు స్వభావిగా, పార్టీలకతీతంగా అభిమానులను సాధించుకున్న వ్యక్తి గౌతమ్ రెడ్డి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు, పరిశ్రమలను రప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. మరణించడానికి వారం రోజుల ముందు కూడా ఆయన దుబాయ్ ఎక్స్‌పోకు హాజరయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించి.. పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆదివారం ఇండియా తిరిగి వచ్చిన గౌతమ్ రెడ్డి.. సోమవారం గుండెపోటుతో మృతి చెందారు.
ఇక సీఎం జగన్ మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కుడిగానే కాక.. జగన్ కి అత్యంత ఆప్తుడిగా గౌతమ్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. జగన్, గౌతమ్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యుడిలా భావించేవారు. ఇరువురి మధ్య సోదరభావం ఉండేది. జగన్ కోసం గౌతమ్ రెడ్డి ఎవరు ఊహించని త్యాగం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. జగన్ కోసం తన కెరీర్ నే పణంగా పెట్టారు గౌతమ్ రెడ్డి. కష్ట సమయంలో జగన్ కు అండగా ఉన్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా.. వైఎస్ కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి : మేకపాటి గౌతమ్ రెడ్డి చివరి వీడియో వైరల్తొలి నుంచి వైఎస్ కుటుంబంతోనే..
మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. ఇక ఆది నుంచి మేకపాటి కుటుంబం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ మరణానంతరం కూడా జగన్ కు మద్దతుగా వారి కుటుంబంతోనే ఉన్నారు. అయితే ఈ సమయంలో రాజమోహన్‌రెడ్డి ఓ విచిత్ర పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
ఫలితాల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే.. అనగా 2009, సెప్టెంబర్ 2న మృతి చెందారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంతంగా వైఎస్సార్‌సీపీ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో మేకపాటి కుటంబం కూడా జగన్ తోనే ఉన్నారు.
ఇది కూడా చదవండి : ఆ సమస్య వల్లే గౌతమ్ రెడ్డి మృతి చెందారా..?జగన్ కోసం కెరీర్ నే త్యాగం
అయితే రాజమోహన్‌రెడ్డి తొలుత జగన్ వెంట నడవడానికి కొంత తటపటాయించారట. తన తర్వాత కుమారుడు గౌతమ్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. వారసత్వాన్ని కొనసాగించాని భావించిన రాజమోహన్‌రెడ్డి.. జగన్ కు మద్దతిచ్చి.. వైసీపీలో చేరితే.. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడ్డారని సన్నిహితులు తెలిపారు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి తండ్రికి ధైర్యం చెప్పడమే.. కాక పదవుల కన్నా.. నమ్మకం, విశ్వాసం ముఖ్యమని చెప్పి జగన్ వెంట నడవడానికే నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి.. తన కెరీర్ ను పణంగా పెట్టి.. జగన్ కు మద్దతుగా నిలిచి వైసీపీలో చేరారు.
అనంతరం గౌతమ్ రెడ్డి మొదటిసారి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైఎస్సార్ సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఆ తర్వాత సన్నిహితులు ద్వారా గౌతమ్ రెడ్డి చేసిన త్యాగం గురించి తెలుసుకున్న జగన్.. ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా గౌతమ్‌రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడమే కాక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అత్యంత కీలకమైన మంత్రి పదవి అప్పగించారు. అలా వైఎస్ కుటుంబం కోసం తన భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా నిర్ణయం తీసుకున్న గౌతమ్ రెడ్డి అంటే జగన్ కు ప్రత్యేక అభిమానమే కాక.. కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నమ్మిన వారిని విడవకూడదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన గౌతమ్ రెడ్డి.. ఇప్పుడందరిని వదిలి వెళ్లిపోవడం విచారకరం. గౌతమ్ రెడ్డి చేసిన త్యాగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.