జనసేన పార్టీకి ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
జనసేన పార్టీకి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పవన్ పార్టీకి గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేనకు గాజు గ్లాసు గుర్తునే కొనసాగించనున్నారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. జేఎస్పీని రిజర్వుడు సింబల్ కలిగిన పార్టీల జాబితాలోనే ఉంచింది. అలాగే టీడీపీ, వైఎస్సార్సీపీలను కూడా గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల లిస్టులో వాటి గుర్తులతోనే కొనసాగించింది. అయితే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వరకు మాత్రమే ఈ గుర్తులు అమల్లో ఉండనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్‌లోనూ కారు గుర్తునే కేటాయించారు. బీఆర్ఎస్ను ఏపీ రాష్ట్ర పార్టీగా గుర్తించామని పేర్కొన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఏపీలోనూ చీపురు గుర్తునే కొనసాగించనున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చింది. సీపీఐకి కంకి కొడవలి గుర్తు, మహారాష్ట్రలో విపక్ష పార్టీ అయిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి గడియారం గుర్తును కేటాయించారు. ఇకపోతే, గత అసెంబ్లీ ఎలక్షన్స్‌లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరీలో ఉంచింది. దీంతో ఈ గుర్తును ఎన్నికల్లో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కూడా కేటాయించే వీలుంటుంది. ఈ టైమ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కామన్ సింబల్ దక్కించుకున్న జనసేన.. కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది.