హైడ్రోజన్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. హైడ్రోజన్ ను సరిగా హ్యాండిల్ చేయకపోతే భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాంటిది హైడ్రోజన్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడడంతో జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి చెన్నై ఆక్సిజన్ పైపుల లోడ్ తో వెళ్తున్న లారీ చిత్తూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాజ్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. నాయుడుపేట నుంచి బెంగళూరుకు వరి ధాన్యం లోడుతో వెళ్తున్న మరో లారీ కూడా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ షణ్ముగంకు గాయాలు అయ్యాయి. ఇద్దరికీ ఒకే హైవే మీద ప్రమాదం సంభవించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తాజాగా మరో లారీ బోల్తా పడింది. ఏపీ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు నెల్లై జిల్లా కూడంకుళం నుంచి వస్తున్న లారీ బోల్తా పడింది. అణు విద్యుత్ ప్లాంట్ రియాక్టర్లకు అవసరమైన హైడ్రోజన్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పింది.
నెల్లూరు ఐఆర్టీ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో లారీ బోల్తా పడడంతో హైడ్రోజన్ సిలిండర్లు రోడ్డు మీద పడ్డాయి. ఈ ఘటనతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ లోంచి నీటిని లారీ మీద, గాల్లోకి వదిలారు. హైడ్రోజన్ గాల్లో కలిసి మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది ముందు జాగ్రత్తలో భాగంగా చుట్టుపక్కల కొంత దూరం వరకూ వాటరింగ్ చేశారు. ఫ్యూయల్ సెల్స్ లో ఉపయోగించే హైడ్రోజన్ చాలా మండే వాయువు. ఇది లీక్ అయితే గనుక దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. సరిగా హ్యాండిల్ చేయకపోతే మంటలు వ్యాపించడం గానీ పేలుళ్లు సంభవించడం గానీ జరిగే ప్రమాదం ఉంది. అందుకే అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి గాల్లోకి నీటిని స్ప్రే చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.