ఫేస్‌బుక్‌లో యాక్టీవ్‌గా ఉండే వారికి ‘గోదారోళ్ల కితకితలు’.. బాగా సుపరిచితమైన పేరు. గోదారి యాసే నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాష భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషి చేసే గోదారోళ్ళ కితకితలు ఫేస్ బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీర వెంకట సత్యనారాయణ ( ఈవీవీ సత్యనారాయణ ) గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గురువారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగానే వున్న ఆయన రాత్రి 11.30 సమయంలో గుండె పోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయన పరిస్థితిని గమనించి ఆస్పత్రికి తరలించేలోపే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బంధువులు, స్నేహితులు, అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని బొమ్మూరులోని ఆయన స్వగృహం వద్దే వుంచారు.
సత్యనారాయణ కోకాకోలా కంపెనీలో ఉద్యోగం చేసేవారు. గోదావరి యాస పై విపరీతమైన మక్కువ కలిగిన ఈవీవీ 2016 లో గోదారోళ్ళ కితకితలు పేరిట ఫేస్ బుక్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ వున్నవారినో ఒకటి చేశారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓ ప్రమాదంలో ఓ స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తా కథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.అనంతరం కొద్ది రోజులకే గ్రూప్ లక్ష మందిని చేరుకుని ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. గ్రూప్ పెట్టిన దగ్గర నుండి ఈవీవీ హాస్య కథనాలతో పాటు తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకుని మధ్య తరగతి ప్రజల స్థితి గతులపై కట్టి పడేసే కథనాలను రాస్తూ.. తనలోని ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే సినిమాల్లో సైతం ప్రవేశించి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. ఈవీవీ మరణ వార్త ఆయన ఫేస్‌బుక్ మిత్రులతో పాటు యావత్ జిల్లా ప్రజలను తీవ్ర ద్రిగ్బంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.