శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ అన్నదాన భవన సముదాయంలో పెద్ద ప్రమాదం తప్పింది. మల్లికార్జున స్వామి దేవాలయంలో వంటగదిలో వంట కోసం ఉపయోగించే బాయిలర్ ఒక్కసారిగా పేలింది. భోజన తయారీ కోసం వినియోగించే స్టీమ్ వాటర్ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలింది. అన్నం వారుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భక్తుల కోసం నిత్య అన్నదానం చేసే చోట ఇలా పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయం తెలుసుకున్న దేవస్థాన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని.. బాయిలర్ పేలుడుకి గల కారణాలు ఏమిటన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
ప్రెజర్ కారణంగా బాయిలర్ పేలినట్లు దేవస్థాన అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఎక్కువగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివస్తారు. అందుకే వారికి ఇబ్బందులు కలగకుండా మరొక చోట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తునట్టు దేవస్థాన సిబ్బంది వెల్లడించినట్లు తెలుస్తోంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా రోజూ భోజన సౌకర్యం కల్పిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల కోసం భోజనం సిద్ధం చేస్తున్న సమయంలో బాయిలర్ పేలింది.