సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నంలో జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సముద్రాన్ని చూస్తూ బతికేయాలని భావిస్తుంటారు. అలాంటి సుందరమైన విశాఖపట్నంలో జీవించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. విశాఖపట్నం రాజధానిగా మారబోతుందని.. విశాఖలో తన నివాసం మార్చబోతున్నానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని జగన్ ప్రకటించారు. విశాఖకు రాజధాని తరలింపు పనుల మీద స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినట్లు సమాచారం. దీని మీద జిల్లా యంత్రాంగానికి ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదు. కానీ మౌఖిక ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాజధాని తరలింపునకు సంబంధించిన సమాచారం ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ముందస్తుగా అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులు వైజాగ్ లోని కొన్ని ప్రాంతాల్లో భవనాలను రహస్యంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక సీఎం జగన్ అధికారిక నివాసం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ బీచ్ రోడ్డులో అనుకూలంగా ఉండే ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల విశాఖలో ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్కన వీఎంఆర్డీఐ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టగా.. ఈ మార్గంలో జగన్ అధికారిక నివాసం ఉండవచ్చునని సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉండడానికి భవనాల కోసం అధికారులు వెతుకుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. మార్చి 22, 23వ తేదీల్లో జగన్ గృహప్రవేశం చేస్తారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటనం రావాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.