తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కవిత నేడు విచారణకు హాజరవుతుండగా.. వివేకా కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. ఇక తాజాగా సీఐడీ రంగంలోకి దిగింది. ఆ వివరాలు..
మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ తనిఖీలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికాలు నివాసాల్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించడమే కాక ఖాతాదారుల సొమ్ము మల్లింపు, నిబంధనల ఉల్లంఘింపులకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. సీఐడీ అధికారులు శనివారం ఉదయం నుంచి మార్గదర్శి మేనేజర్లు, అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్ శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకుని.. సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
ఇక గతంలోనూ సీఐడీ, రిజస్ట్రేషన్ శాఖ అధికారులు.. మార్గదర్శి సంస్థల్లో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో తనకు అందిని ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. మార్గదర్శి కార్యాలయాల్లో కొద్ది రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా సీఐడీ, జీఎస్టీ, ఎన్‍ఫోర్స్ మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాక మార్గదర్శి అధికారులు గత 8 ఏళ్లుగా రికార్డులు సమర్పించలేదనేది అధికారుల వాదన. డిపాజిటర్ల సమాచారం కూడా ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. వీరి వాదన ఇలా ఉంటే.. మార్గదర్శి యాజమాన్యం వాదన ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. గడిచిన ఆరు దశాబ్దాలుగా తమ సంస్థ చరిత్రలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర లేదని సంస్థ పేర్కొంది. అదికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ తమ సిబ్బంది సహకరిస్తున్నారని చెప్పుకొచ్చింది.
మార్గదర్శికి సంబంధించి రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవని గతంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. తగిన ఆధారాలతో ఉల్లంఘనలపైన చర్యలు తీసుకోవాలని జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజయవాడ-గుంటూరు మార్గదర్శి శాఖల మేనేజర్లను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ అధికారులతో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులు కూడా సోదాల్లో ఉన్నట్లు సమాచారం.