విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సామాన్యులపై విద్యుత్ భారం పడకుండా చర్యలు చేపట్టింది.
విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ భారం పడకుండా చర్యలు చేపట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విద్యుత్ టారిఫ్ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచలేదని.. వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని అన్నారు. విశాఖపట్నం ఈపీడీసీఎల్ కార్యాలయంలో మాట్లాడిన నాగార్జున రెడ్డి.. ఈ ఏడాది వినియోగదారులపై పైసా భారం కూడా ఉండదని వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఇస్తున్న సబ్సిడీ, ఆక్వా రంగానికి, నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిందని వెల్లడించారు.
ఉచిత విద్యుత్, సబ్సిడీ, రాయితీలకు అయ్యే రూ. 10,131 కోట్ల ఛార్జీలను భరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషమని అన్నారు. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని నాగార్జున రెడ్డి అన్నారు. మూడు డిస్కంలకు కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్ వల్ల రూ. 10,131 కోట్లు లోటు వచ్చిందని.. అయితే ఈ లోటును పూడ్చడానికి విద్యుత్ ధర పెంచి సామాన్యులపై భారం వేసే పని లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిందని.. ఈ లోటును భరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని నాగార్జున రెడ్డి అన్నారు. అందుకే సామాన్యులపై భారం వేసే అవసరం లేకుండా పోయిందని అన్నారు. సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరీలో అదనపు ఛార్జీలు ఉండవని, అయితే హెచ్టీ వినియోగదారులకు మాత్రం కిలో వాట్ కు రూ. 475 అదనపు డిమాండ్ చార్జీల ప్రతిపాదనను అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.
మిగతా ప్రతిపాదనలను తిరస్కరించామని అన్నారు. ఏవైనా కారణాల వల్ల సోలార్ పంపుసెట్లు చెడిపోతే విద్యుత్ మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేసేందుకు డిస్కంలు ముందుకొచ్చాయి. మొత్తానికి 10 వేల కోట్లకు పైగా భారాన్ని సామాన్యులపై పడకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సోలార్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యుత్ అవసరం ఉంటే గనుక ఉచితంగా విద్యుత్ అందించే విధంగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో పాటు ఎస్సీ,ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ విద్యుత్ పై సబ్సిడీ ఇవ్వడం, అలానే ఆక్వారంగం, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీలను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ కారణంగా సామాన్యులపై విద్యుత్ భారం తప్పింది. మరి సామాన్యులపై విద్యుత్ భారం తప్పేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.