ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ నెలలో వారి ఖాతాల్లో రెండు రకాలుగా ఆర్థిక సాయం అందుతోంది.
సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలకు చేరవేస్తుంది. డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇక ఈ నెలలో రైతుల కళ్ళలో సంతోషాన్ని నింపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రకాలుగా వారికి ఆర్థిక సహకారాన్ని అందించనుంది. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల ఈ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చిందని సంబరపడుతున్న వేళ అకాల వర్షాలు వారి ఆనందాలను దూరం చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగిపోవడం, చేతికొచ్చిన పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో నాశనమవ్వడం, కోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవ్వడం వంటి కారణాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని వెల్లడించింది. తడిసిన ధాన్యాన్ని మంచి ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక ఏపీలో వానల కారణంగా పంట నష్టపోయిన రైతులను కూడా జగన్ సర్కార్ ఆదుకోనుంది. ఈ నెలలోనే రైతు భరోసాతో పాటు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలపై వివరాలు సేకరించాలని.. రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచి తనిఖీ చేయాలని ఆదేశించారు. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా నిధులను ఫిబ్రవరి నెలలో జగన్ సర్కార్ జమ చేసింది. మూడో విడత రైతు భరోసా, పీఎం కిసాన్, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతు భరోసా నిధులను, ఇన్పుట్ సబ్సిడీ నిధులను జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.