నాయీ బ్రాహ్మణులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పాలక మండళ్లలో ధర్మకర్తలుగా నాయీ బ్రాహ్మణులను నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. దేవాదాయ శాఖ పరిధిలో 5 లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవాదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు.. 5 లక్షలకు పైన ఆదాయం సమకూరే 1234 దేవాలయాల్లో ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని ఆలయాలకు పాలక మండలి నియామకం పూర్తయ్యింది. మరో 610 ఆలయాలకు 610 ఆలయాలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది.
అయితే ఈ పాలక మండళ్లలో నాయీ బ్రాహ్మణులకు చెందిన వారికి పాలకవర్గ సభ్యుడి పదవి కట్టబెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాల్లో పాలక మండళ్లలో పాలకవర్గ సభ్యుడిగా, ధర్మకర్తలుగా నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. నాయీ బ్రాహ్మణులకు దేవాలయ సంప్రదాయాలతో ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే నిర్వహణలో నాయీ బ్రాహ్మణులకు భాగస్వామ్యం కల్పించేలా ప్రతీ ట్రస్ట్ బోర్డులోనూ ఒకరికి సభ్యుడిగా అవకాశం ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకి సేవల్లో నాయీ బ్రాహ్మణుల భాగస్వామ్యం ఎంతగానో ఉంది.
ఇప్పుడు పాలక మండలిలో కూడా ధర్మకర్తలుగా వీరికి స్థానం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 610 ఆలయాలకు సంబంధించి కొత్త ట్రస్టు బోర్డులను కొద్దిరోజుల్లో నియమించనుంది ప్రభుత్వం. వీటిలో ఒక్కో ఆలయంలో ఒక్కో ట్రస్టు బోర్డులో సభ్యుడిగా నాయీ బ్రాహ్మణుడికి స్థానం కల్పించనున్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దేశ చరిత్రలోనే నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని మరో మెట్టు ఎక్కించిందని.. తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.