ఏపీలోని వైఎస్సార్ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భూమిలేని అమరావతి గ్రామ వాలంటీర్లకు రూ. 2500 పెన్షన్ ను ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంటున్న గ్రామ వాలంటీర్లకు ఇటీవల తీపి కబురు చెప్పిన సంగతి విదితమే. భూమిలేని నిరుపేదలకు ఇచ్చే నెలవారీ రూ. 2500 పెన్షన్‌ను, అమరావతి ప్రాంతాల్లో భూమిలేని గ్రామాల వాలంటీర్లకు వర్తింప చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 1 నుండి అమల్లోకి రానున్న ఈ పింఛను విధానం వల్ల సుమారు 200 మంది నిరుపేద గ్రామాల వాలంటీర్లు లబ్ది పొందనున్నారు. తాజాగా నిరుద్యోగులకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని జగన్ సర్కార్ తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యుఎస్) వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా ఈడబ్ల్యుఎస్ వర్గాలకు 5 ఏళ్ళు వయోపరిమితి పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 34 ఏళ్ళు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈ డబ్ల్యుఎస్ వర్గానికి చెందిన వ్యక్తులు లబ్ది పొందనున్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జీతంతో పాటు న్యూస్ పేపర్ల కోసం మరో రూ.200 చొప్పున అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ ప్రత్యేక భత్యం చెల్లించేందుకు సచివాలయాల్లో ప్రత్యేక ఖాతాలను తెరిచారు. ఇకనుంచి ఇదే ఖాతాల నుంచి నిధులు డ్రా చేసి చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు సచివాలయాల శాఖ లేఖ రాసింది.
అంతే కాకుండా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు, విశేషాలతో టేబుల్ గైడ్ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇంగ్లీష్, జర్మనీ, స్పానిష్, చైనీస్ భాషల్లో ఈ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. విశాఖలో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కోసం వీటిని తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, రాయబార కార్యాలయాల్లో, పర్యాటక కేంద్రాల్లో అందబాటులో ఉంచుతారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల సైన్సు ఫెయిర్‌ను విజయవాడలో నిర్వహించనున్నారు. ఆంధ్ర లయోలా కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు 10 చొప్పున మొత్తం 260 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచుతారు. ఐదు థీమ్‌లపై ఒక్కో థీమ్‌కు రెండేసి చొప్పున జిల్లాల నుంచి ప్రాజెక్టులు రానుండగా.. ప్రతి థీమ్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నారు.