ఐదేళ్ల చిన్నారి అంటే.. ఆడుతూ పాడుతూ.. అమ్మనాన్నలతో కలిసి ఆనందంగా గడపాల్సిన సమయం. అమ్మ ప్రేమ.. నాన్న అనురాగాన్ని అనుభవిస్తూ సంతోషంగా గడపాల్సిన వయసు. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. చక్కగా బడికెళ్తూ.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటూ.. అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉండాల్సిన దశ. మరీ ముఖ్యంగా నాన్న వేలు పట్టుకుని నడుస్తూ.. మారాం చేస్తే.. ఆయన వీపు ఎక్కి గుర్రం ఆట ఆడుకోవాల్సిన వయసు. అయితే ఆ చిన్నారి విషయంలో విధి వింత నాటకం ఆడింది. తండ్రి చేయి పట్టుకుని ఆడుతూపాడుతూ గడపాల్సిన చిన్నారి.. ఐదేళ్ల వయసుకే తండ్రికి కన్నతల్లిగా మారి.. సేవలు చేయాల్సి వస్తుంది. ఆ చిన్నారికి వచ్చిన కష్టాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కంట తడి పెట్టిస్తోంది. ఆ వివరాలు..
శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన పాట్నూరు సత్యనారాయణకు భార్య, ఐదేళ్ల కుమార్తె చందనప్రియ ఉన్నారు. ఈక్రమంలో కుటుంబ పోషణ నిమిత్తం 15 ఏళ్ల క్రితం సత్యనారాయణ హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఇక్కడ గాజులరామారం షాపూర్‌నగర్‌లో నివసిస్తూ.. కూలి పనులు చేస్తూ.. భార్య, బిడ్డలను పోషించేవాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం.. మే నెలలో ఓ దుకాణం పైన బోర్డు ఏర్పాటు చేస్తుండగా.. సత్యనారాయణకు అనుకోని ప్రమాదం జరిగింది.
బోర్డు ఏర్పాటు చేస్తున్న క్రమంలో సత్యనారాయణకు కరెంట్ షాక్ కొట్టి.. రెండు చేతులు కాలిపోయాయి. దాంతో ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సత్యనారాయణ భార్య మీదనే పడింది. దాంతో ఆమె కూలీ పనులకు వెళ్లి.. మంచానికి పరిమితమైన భర్తను, కుమార్తెను పోషించుకుంటుంది. ఈ క్రమంలో సత్యనారాయణ భార్య కూలీ పనులకు వెళ్తుండగా.. కుమార్తె ఐదేళ్ల చందన ప్రియ ఇంటి దగ్గరే ఉంటూ తండ్రి ఆలనాపాలన చూసుకోసాగింది. చేతులు కోల్పోయిన తండ్రికి అమ్మలా మారి.. అన్నం తినిపించి, అన్ని పనులు చూసుకోసాగింది. ఐదేళ్లకే తండ్రకి తల్లిలా మారి.. సేవలు చేస్తోన్న చిన్నారిని చూపి ప్రతి ఒక్కరు కంట తడిపెడుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని, దివ్యాంగుల కోటా కింద ఫించను మంజూరు చేయాలని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. భార్య సంపాదన తిండికే సరిపోవడం లేదని.. ఇంటికి అద్దె కట్టే పరిస్థితి లేదని.. దాంతో యజమాని తమను ఇల్లు ఖాళీ చేయించారని వాపోయాడు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.