అనంతపురం జిల్లా కదిరిలో తీవ్ర విషాదం నెలకొంది. కదిరి పాత ఛైర్మన్ వీధిలో తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఆ భవనం శిథిలాలు మరో రెండు భవనాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఒక ఇంట్లో 8 మంది, మరో ఇంట్లోని ఏడుగురు సహా మొత్తం 15 మంది చిక్కుకున్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతిచెందారు. శిథిలాల కింద నుంచి 10 మందిని రక్షించారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఇద్దరు శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారని చెబుతున్నారు. ఘటనాస్థలిలో రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సమక్షంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. భవనం కూలిపోయే సమయంలోనే గ్యాస్ సిలిండర్ కూడా పేలిందని బాధితులు చెబుతున్నారు. ఘటనాస్థలిని అదనపు ఎస్పీ, ఆర్డీవో పరిశీలించారు.