మనుషుల్లో రోజురోజుకు మానవత్వం చచ్చిపోతుంది. దీంతో అనేక మంది సరైన సమయంలో సాయం అందక చనిపోతున్నారు. రోడ్డు మీద కానిస్టేబుల్ కుటుంబం సాయం కోసం ఆర్జిస్తున్నా కూడా స్థానికులు పట్టించుకోకపోగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. జనానికి కష్టం వస్తే ముందుండేది పోలీస్. అలాంటి పోలీస్ ప్రమాదంలో ఉంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం.
అనంతపురం జిల్లాలో ఓ కానిస్టేబుల్ తన భార్యతో కలిసి బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ వాహనం వారి మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో చుట్టూ జనం ఉన్నారు. కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఏమైంది అని కనీసం దగ్గరకు వెళ్లి మాట్లాడింది లేదు. 108కి ఫోన్ చేసాం కదా మా పని అయిపోయిందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మానవత్వం మంటగలిసి పోవడంతో దురదృష్టవశాత్తు కానిస్టేబుల్ మరణించారు. ఆయన భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. చనిపోయిన కానిస్టేబుల్ పేరు కిరణ్ కుమార్. అనంతపురం జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య పేరు అనిత. శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.
వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నగరంలో ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు. భార్య అనితను సోమలదొడ్డి క్రాస్ వద్దకు తీసుకొచ్చి రోజూ బస్సు ఎక్కించేవారు. ఎప్పటిలానే బుధవారం కూడా భార్యను బైక్ పై సోమలదొడ్డి క్రాస్ వద్దకు తీసుకొచ్చేందుకు ఉదయం 7:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో నగర శివారులోని గోపాల్ డాబా వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన వాహనం వారి మీద నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కాళ్ళు రెండూ తీవ్ర గాయాలు కాగా.. భార్య ముఖానికి, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
రోడ్డుపై కదలలేని స్థితిలో రక్తపు మడుగులొ ఉన్న ఆ కానిస్టేబుల్ దంపతులను కాపాడేందుకు అక్కడున్న స్థానికులు ఎవరూ వెళ్ళకపోవడం బాధాకరం. చుట్టూ నిలబడి సినిమా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారే తప్ప ఏమైనా సహాయం చేద్దామన్న ఇంగితం లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ ముందుకు రాకపోవడంతో రోడ్డు మీద ఆ దంపతులు ఒకరికొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు చేసిన అతి పెద్ద సాయం కష్టపడి జేబులోంచి ఫోన్ తీసి అంబులెన్స్ కాల్ చేయడమే. అంతే అంతకు మించి ఏమీ చేయలేదు. స్పందించి ఉంటే బతికేవారో లేదో తర్వాత విషయం ముందు మానవత్వం ఉండాలి కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత బెంగళూరుకు తరలిస్తుండగా కిరణ్ కుమార్ ఆయన భార్య అనిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తమను కాపాడాలని.. ఇదొక్కసారికి తమ ప్రాణాలు కాపాడండి అన్న.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వాళ్లకి మేము తప్ప ఎవరూ లేరు.. తమని బతికించండి అంటూ తనను వేసుకున్నట్లు జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ వెల్లడించారు. కానిస్టేబుల్ కిరణ్ కుమార్ తనతో మాట్లాడిన ఆఖరి మాటలు అవే అంటూ వెల్లడించారు. అంబులెన్స్ వచ్చేలోపు ఇద్దరినీ బండి మీదనో లేక వేరే వాహనం మీదనో ఆ అంబులెన్స్ కి ఎదురు వెళ్తే సమయం ఆదా అయ్యి బతికే ఛాన్స్ ఉంటుంది కదా. అంబులెన్స్ కి కాల్ చేసాం కదా.. వస్తుందిలే అనుకుంటే టైమ్ ఉండదు కదా. ఆ టైమ్ వరకూ ప్రాణం ఉండదు కదా. మరి కానిస్టేబుల్ దంపతులు రోడ్డు మీద రక్తపు మడుగులో ఉంటే పట్టించుకోకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్న స్థానికులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.