గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. కడప జిల్లాలో ప్రమాదకరస్థాయిలో వర్షాలు కురుస్తోండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది.
మట్టికట్ట కొట్టుకుపోవడంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలను నీరు చుట్టుముట్టాయి. చెయ్యేరు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. చెయ్యేరు నదిలో 30 మంది కొట్టుకుపోగా.. ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గల్లంతైన వారి సంఖ్య 30 కంటే ఎక్కువే ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. మరణించిన వారిసంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు నందలూరు వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు.