అయ్యో అశ్విన్.. బెంచ్ కే పరిమితమవ్వడం వెనుకున్న కారణం?

virat

ఓవల్‌ వేదికగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 50 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ గెలిచి ఔరా అనిపించింది. బ్యాటుతో కాకపోయినా.. కెప్టెన్‌గా కోహ్లీ మరోసారి ది బెస్ట్‌గా నిరూపించుకున్నాడు. కానీ, ఐసీసీ టెస్ట్‌ ర్యాకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న బౌలర్‌. టెస్టుల్లో 413 వికెట్లు తీసిన భారత స్టార్‌ స్పిన్నర్‌, ఆల్‌రౌండర్‌ ‘రవిచంద్రన్‌ అశ్విన్‌’ని బెంచ్‌కే పరిమితం చేయడంపై మాత్రం కోహ్లీకి విమర్శలు తప్పడం లేదు. క్రికెట్‌ నిపుణులు, భారత మాజీ క్రికెటర్లే కాదు.. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ‘నిక్‌ కాంప్టన్‌’ కూడా ట్విట్టర్‌ వేదికగా కోహ్లీపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. నాలుగో టెస్టులో కచ్చితంగా అశ్విన్‌కు చోటు దక్కుతుందనే అందరూ భావించారు. ఓవల్‌ మైదానంలో పిచ్‌ చివరి రోజుల్లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే వార్తలు విని అశ్విన్‌కు చోటు ఖాయమనే అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా జడేజా తుది జట్టులో స్థానం సంపాదించాడు. ఆల్‌ రౌండర్‌గా అశ్విన్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. టెస్టుల్లో అశ్విన్‌ 5 సెంచరీలతో 2,656 పరుగులు చేశాడు. గణాంకాల పరంగా అశ్విన్‌ జడేజాకంటే ముందు వరుసలోనే ఉంటాడు. స్టార్‌ బౌలర్‌, ఆల్‌రౌండర్‌ అయిన అశ్విన్‌ తుది జట్టులో చోటు సంపాదించలేకపోవడం క్రికెట్‌ అభిమానులకు ఒకింత ఆశ్చర్యం, బాధగానే ఉంది. ఎందుకు అశ్విన్‌ జట్టులోకి రాలేకపోతున్నాడనే ఆలోచన చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే అందరూ కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కానీ, కోహ్లీ కెప్టెన్‌ పరంగా ఓవల్‌ వేదికగా తన నిర్ణయం సరైందేనని నిరూపించుకున్నాడు. లీడ్స్‌లో పరాజయం తర్వాత టీమిండియా ఓవల్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది

viratఅశ్విన్‌ తుది జట్టులో లేకపోవడంపై ప్రెజెంటేషన్‌లో కోహ్లీని ప్రశ్నించగా ‘ఏ నిర్ణయమైనా జట్టు మొత్తం కలిసే తీసుకుంటాం. జట్టుకు ఏది కావాలో అదే మేం చేస్తాం. మేము గణాంకాలు, స్టాటిస్టిక్స్‌ చూడము.. అంతిమంగా జట్టు విజయమే మా లక్ష్యం’ అంటూ కోహ్లీ వివరణ ఇచ్చాడు. ‘ఇంగ్లాండ్‌ టీమ్‌లో మొత్తం నలుగురు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. వారిని కట్టడి చేయాలంటే జడేజానే సరైన నిర్ణయమని భావించినట్లు’ కోహ్లీ తెలిపాడు. విమర్శలు పక్కన పెడితే కోహ్లీ నిర్ణయం ఫలితాన్నిచ్చిందనే అభిమానులు భావిస్తున్నారు. ఆఖరి రోజు 10 వికెట్లు తీసి 157 పరుగుల ఆధిక్యంతో గెలుపొందడం సాధారణ విషయం కాదని అభిప్రాయ పడుతున్నారు. నాలుగో టెస్టులో బ్యాటింగ్‌ పరంగా మెప్పించలేకపోయినా.. జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. నాలుగు వికెట్లు తీసి బౌలింగ్‌ పరంగా మంచి మార్కులే సాధించాడు. రానున్న సిరీస్‌లోనైనా అశ్విన్‌కు స్థానం ఉంటుందా? లేదా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.