అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ కు వీడ్కోలు పలికిన మిస్టర్‌ 360 ABD..

AB DE Villiers

సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం.. మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్లు ఏబీడీ అధికారికంగా ప్రకటించాడు. ఇంగ్లీష్‌, ఆఫ్రికన్‌, హిందీ భాషల్లో ధన్యవాదాలు అంటూ ఏబీడీ తెలియజేశాడు. చాలా ఉద్వేగభరితంగా తన రిటైర్మెంట్‌ ను ప్రకటించాడు.

‘ఇది ఎంతో అద్భుతమైన జర్నీ.. కానీ, నేను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు మా బ్యాక్‌ యార్డ్‌లో మా అన్నలతో కలిసి క్రికెట్‌ ఆడేటప్పుడు ఎంతో ఉత్సాహం.. కుతూహలం ఉండేది. ప్రస్తుతం 37 ఏళ్ల నాలో కసి.. తపన ఆ స్థాయిలో ఉందని నేను అనుకోవట్లేదు. నాకు చివరిగా  నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా సోదరులు, నా భార్య, నా పిల్లలు చేసిన త్యాగాలే గుర్తున్నాయి. నా జీవితంలోని తర్వాతి అధ్యాయంలో మీకే ముందు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.  నా జర్నీలో భాగస్వాములైన.. జట్టులోని ప్రతి సభ్యుడు, ప్రతి ప్రత్యర్థి, ప్రతి గురువు, ప్రతి ఫిజియో, ప్రతి స్టాఫ్‌ మెంబర్‌ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.  సౌతాఫ్రికా, ఇండియా, ఇంకా నేను ఆడిన ప్రతిచోట నుంచి నాకు అందిన మద్దతుకు రుణపడి ఉంటాను’.

‘టైటాన్స్‌కు ఆడుతున్నప్పుడు లేదా ప్రొటీస్‌ కు లేదంటే RCBకి ఎక్కడ ఆడినా.. క్రికెట్‌ వల్ల నాకు అందిన అనుభవాలు, అవకాశాలకు సంబంధించి నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను. ఇది ఆకస్మికంగా చేసిన ప్రకటనే అయినా.. ఒప్పుకోవాల్సిన నిజం అదే. నేను క్రికెట్‌ కు వీడ్కోలు పలుకుతున్నాను’ అంటూ ABD తన రిటైర్మెంట్‌ ను ప్రకటించాడు.