మూడు రాజధానుల బిల్లు పూర్తి ప్రస్థానం! ఎన్ని మలుపులు తిరిగిందో చూడండి!

3capitals

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన నిర్ణయం వెల్లడైంది. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఈ 3 రాజధానుల వ్యవహారం ఎప్పుడు మొదలైంది? ఎన్ని మలుపులు తిరిగింది? అనే విషయాలను పరిశీలిద్దాం.

జనవరి 20, 2020న అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర పడింది. విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధానిగా బిల్లులో పొందుపరిచారు. కానీ.., ఆ తర్వాత ఈ మూడు రాజధానుల బిల్లుపై జనవరి 22, 2020న శాసన మండలిలో లో పెద్ద రగడే జరిగింది. సమయంలో మండలిలో అధికార పార్టీకి మెజారిటీ లేకపోవడంతో ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది.

ఇక జూన్ 16, 2020న మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో రెండోసారి ఆమోదముద్ర పడింది. జులై 31, 2020న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దుపై హైకోర్టులో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఒకేసారి ఇన్ని కేసులు నమోదు అవ్వడం సంచలనంగా మారింది. వీటి అన్నిటిని పరిశీలించిన హైకోర్టు ఆగస్టు 4, 2020న రాజధాని తరలింపుపై హైకోర్టు స్టే విధించింది.

వికేంద్రీకరణ, CRDA రద్దుపై దాఖలైన అన్ని పిటిషన్లను కుదించి మొత్తం 57 కేసులపై విచారణ చేపట్టారు. మూడు రాజధానుల బిల్లుపై  హైకోర్టు స్టే విధించడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించింది. కానీ.., అక్కడ కూడా జగన్ సర్కారుకి చుక్క ఎదురైంది. ఆగస్టు 26, 2020న ఏపీ ప్రభుత్వం  అప్పీల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 27, 2020 స్టేటస్ కో ఉత్తర్వులను నిరవధికంగా పొడిగించారు. ఇప్పటికీ ఆ స్టే అలానే కొనసాగుతూ వస్తోంది. దీంతో.. ఏపీ రాజధాని వ్యవహారంలో సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకుని రావడానికే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఒక్క నిర్ణయంతో రాజధాని విషయంలో నడుస్తున్న కేసులు అన్నీ వీగిపోయినట్టు అయ్యింది. కానీ.., కొత్త బిల్లులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి.. మూడు రాజధానుల బిల్లులో ఇన్ని మలుపులు తిరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.