తన కాన్వాయ్ ని ‘అంబులెన్స్’ గా మార్చేసిన కేటీఆర్!…

సాటి మనిషి సాయం కోరినా, ప్రమాదంలో ఉన్నా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. ఏ సమయంలోనైనా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారు. సమయమేదైనా సమస్యను ఎవరుచెప్పినా, సాయం చేయాలంటూ తనకు వచ్చే ట్వీట్ల పైన వెంటనే స్పందిస్తారు ఐటీశాఖ మంత్రి తారకరామారావు.  ఇందు కోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసారు.  మరి సమస్యని ప్రత్యక్షంగా చూస్తే!.. సిరిసిల్లలో పర్యటించి హైదరాబాద్ వస్తున్న సమయంలో రోడ్డుప్రమాదం ఘటన ఆయన కంటపడింది. అంతే వెంటనే చలించిపోయారు.స్వయంగా క్షతగాత్రులను ఆయన కాన్వా‌య్‌లోనే ఆస్పత్రికి తరలించారు.

KTR copy minఅంతేకాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రికి ఫోన్ చేసి వైద్యులకు సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను తన కాన్వాయ్ లో ఆస్పత్రికి పంపించి బాధితులకు చికిత్సను అందేలా చేశారు. ఓవైపు కొంతమంది పోలీసులు ప్రొటోకాల్ అంటూ ఎమర్జెన్సీ టైం అంటూ కేటీఆర్ ను ఆపినా సరే అవన్నీ పక్కనపెట్టి మంత్రి కేటీఆర్ చూపించిన మానవత్వంపై అందరి నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సిద్దిపేట పట్టణ శివారులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈ ప్రమాదంలో సిద్దిపేట కాళ్లకుంట కాలనీకి చెందిన జాఫర్‌ (26), యాకూబ్‌ (30) గాయపడ్డారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వెళ్తున్నారు. ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపి రెండు వాహనాల్లో క్షతగాత్రులను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.

మంత్రి కేటీఆర్ చేసిన సాయంపై ట్విట్టర్‌లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.