మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో

ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ కు పరిచయం చేశారాయన. అటువంటి దర్శక ధీరుడి డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2022 జనవరి 7న విడుదలకు సిధ్దం చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ లు హీరోలుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెకొన్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో రాజమౌళి నెక్ట్స్ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

vikram 1

ఆఫ్రికన్ అడ్వంచరస్ థ్రిల్లర్ ను కథాంశంతో మహేష్ బాబుతో సినిమాకు రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ సినిమాలో మహేశ్ బాబు స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీలో జేమ్స్ బాండ్ తరహాలోని గెటప్ తో మహేశ్ అలరించబోతున్నారట. ఈ సినిమాకు సంబందించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ ను విలన్‌ గా కన్ఫర్మ్ చేశారన్న చర్చ జరుగుతోంది.

దర్శకుడు రాజమౌళి తన ప్రతీ సినిమాకీ పాన్ ఇండియా స్థాయిలోనే ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మహేశ్‌ బాబుతో చేయబోయే ఈ సినిమాకి తమిళ స్టార్ హీరోని విలన్ గా ఫిక్స్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇంకా మరి కొందరు ఇతర భాషలకు సంబంధించిన క్రేజీ నటుల్ని ఎంపిక చేయబోతున్నారట రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.