భారత్ లో భారీ పేలుళ్లకు కుట్ర, ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్

న్యూ ఢిల్లీ- మన దేశానికి ఉగ్రవాదుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంపై ఎల్లప్పుడు కుట్ర పన్నుతూనే ఉంటారు. కశ్మీర్ నుంచి మొదలు ఎక్కడో ఓ చోట విద్వంసానికి ఉగ్రవాదులు ప్రాణాళికలు రిచిస్తూ ఉంటారు. కానీ మన దేశ సైన్యం, ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రమూకల ఆగడాలను కట్టిస్తూ దేశ ప్రజలను సురక్షితంగా కాపాడుతున్నారు.

తాజాగా భారత్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని పలు రద్దీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ వెల్లడించారు. వినాయక చవితి, దసరా నవరాత్రుల సమయంలో రామ్‌ లీలా మైదానంతో పాటు దుర్గా పూజా మండపాల వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

DELHI POLICE 1

ఈ కుట్రలకు ప్రణాళికలు రచించిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని ఫామ్‌ హౌస్‌లో శిక్షణ పొందారని, ఆర్డీఎక్స్ బాంబును అండర్‌‌వరల్డ్ సాయంతో ఢిల్లీకి తీసుకువచ్చారని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. 1993 తర్వాత ఆర్డీఎక్స్‌ బాంబును రాజధానికి తరలించడం ఇదే మొదటిసారి అని పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ పేర్కొన్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం ఆర్డీఎక్స్‌ బాంబును భారత్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు.

మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒసామా, జీషాన్‌కు 15 రోజుల పాటు శిక్షణ సైతం అనీస్ ఇబ్రహీం ఇప్పించాడని ఠాకూర్ చెప్పారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. పట్టుకున్న ఉగ్రవాదులను విచారిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.