రోల్స్ రాయ్స్ ఎలక్ట్రిక్ విమానం.. గంటకు 623 కిలోమీటర్ల వేగం

బిజినెస్ డెస్క్- ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌ లు, కార్ల నుంచి మొదలు విమానాల వరకు ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్నాయి. ఇదిగో ఇటువంటి క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయ్స్‌ ఏకంగా ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రోల్స్ రాయ్స్ ఇటీవల పరీక్షించింది. రోల్స్ రాయ్స్ తయారు చేసిన స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ ఆల్‌ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది.

ఇంగ్లండ్ రక్షణ మంత్రిత్వ శాఖ బోస్కోంబ్‌ డౌన్‌ టెస్టింగ్‌ సైట్‌ లో ఈ సూపర్ ఎలక్ట్రిక్ విమానాన్ని పరీక్షించారు. టెస్ట్‌ ఫ్లైట్‌ ను రోల్స్‌ రాయ్స్‌ కంపెనీ ఫ్లైట్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ ఫిల్‌ ఓడెల్‌ విజయవంతంగా నడిపారు. ఇక రోల్స్ రాయ్స్ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ విమానానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ విమానం. ఏ మాత్రం ఇంధనం లేకుండానే బ్యాటరీలతో నడుస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ విమానం గంటకు 623 కిలో మీడర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Rolls Royce 1

ఈ వేగం గత విమానాల రికార్డుకంటే 212.5 కిలోమీటర్లు ఎక్కువ. కేవలం 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం మరో ప్రత్యేకత. గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 555.9 కిలోమీటర్ల, 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 531.1 కిలోమీటర్లు, 202 సెకన్లలో మూడు వేల మీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను రోల్స్ రాయ్స్ స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ఈ సూపర్ ఎలక్ట్రిక్ విమానంలో 400 కిలోవాట్ల పవర్‌ బ్యాటరీని అమర్చారు. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్‌ ఫోన్లు పూర్తిగా చార్జ్‌ చేస్తే ఎంతుంటుందో అంత పవర్ అన్న మాట. మనం ఇంట్లో ఉపయోగించే వాషింగ్‌ మెషీన్స్‌ లో ఉండే స్పిన్‌ 1000 ఆర్పీఎం ఉంటుంది. ఈ విమానం ప్రొఫెల్లర్స్‌ దానికి రెట్టింపు సామర్థ్యంతో తిరుగుతాయి. బ్యాటరీని కూల్‌ గా ఉంచడం కోసం పోర్చుగీస్‌ కార్క్‌ తో థెర్మల్‌ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ ట్యాక్సీస్‌ తమ భవిష్యత్‌ ప్రణాళిక అని చెబుతోంది రోల్స్‌రాయ్స్‌. త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ విమానాలను ఎందుబాటులోకి తీసుకువస్తామని రోల్స్ రాయ్స్ చెబుతోంది.