శ్రీ వినాయకుని నైవేద్యములలో అత్యంత ప్రశస్తమైనది ఏమిటో తెలుసా!?.

ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు.  ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి ఇంటా యథావిధి గణపతిని పత్రాలతో పూజించి ఆయనకు ప్రీతికరంగా ఉండ్రాళ్ళు, కుడుములు, వెలగ, అరటి, కొబ్బరి మొదలైన ఫలాలు నివేదించాలి.
Lord Vinayaka min
వినాయక చవితి రోజు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టి ఏవి పెట్టకపోయినా అపచారం లేదు. మనం కాయగూరగా తినేది ఏదైతే వున్నదో , పండిపోయిన తరువాత లోపల గింజలను తనంతట తాను విడిచిపెట్టేసేది దోసపండు. ముచ్ఛిక నుండి తనంతటతాను తేలికగ విడిపోయేది దోసపండు. దోసపండు ముచ్ఛికలోనుంచి విడివడినట్టు, దోసపండు లోని గింజలు దోసపండులోనే ముద్దగా పడిపోయినట్లు, ఎంత త్వరగా జీర్ణం అవుతుందో అంత అజ్ఞానంలో నేను వున్నాను అని చెప్పటానికి,నేను మోక్షాన్ని పొందటానికి మధ్యలో వున్నటువంటి ప్రతిబంధకములన్నీ తనంతట తాను తొలగి, నేను ఈశ్వర నాదంలోప్రయాణం చేసే స్థితిని పొందాలని ప్రార్ధించటానికి అంత మాటను నువ్వు చెప్పలేవేమోనని దోసపండుని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించమన్నారు.
పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఈస్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయి. వెంటనే దయ చూపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు.