ఇంట్లో ఎలాంటి శుభకార్యం తలపెట్టినా.. ఏ పూజి చేసినా సరే.. ముందుగా గణేషుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. మనుషులే కాదు.. దేవతలు సైతం ప్రథమంగా వినాయకుడినే పూజిస్తారని ప్రతీతి. ఎందుకంటే ముందుగా ఆయన పూజ తలపెడితే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా మంచే జరుగుతుందని నమ్మకం. విఘ్నాలను తొలగించడమే కాక.. గణాలకు నాయకుడైన వినాయకుడి పుట్టినరోజును హిందూవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వీధి వీధిన వినాయక మండపాలు పెట్టి.. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వినాయక చవితి జరుపుకుంటారు. ఇకపోతే ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31 వ తేదీనాడు వచ్చింది. అయితే ఈ వినాయక చవితి నాడు చందమామను చూడకూడదు అంటారు. ఎందుకు చూడకూడదు.. అంటే..
పురాణాల ప్రకారం వినాయకుడి పుట్టుకనే ఆశ్చర్యచకితంగా ఉంటుంది. కైలాసంలో పార్వతి మాత.. శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే త్రినేత్రుడు ఎంతకీ రాకపోయే సరికి స్నానానికి సిద్ధమవుతుంది. అలా వెళ్లడానికి ముందు పార్వతి మాత తన కోసం సిద్ధం చేసుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారుచేస్తుంది. ఎంతో ముద్దుగా ఉన్న ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేస్తుంది. ఇక ముద్దులొలకు ఆ బాలకుడిని ఇంటి ప్రధాన ద్వారం ముందు కాపలాగా పెట్టి.. అమ్మ స్నానానికి వెళ్తుంది. ఆ సమయంలో శివుడు వస్తాడు. ఆయన గురించి తెలియని గణపతి.. శివుడిని అడ్డుకుంటాడు. దాంతో ముక్కంటికి కోపం వచ్చి బాలుడి తలను శూలంతో నరికేస్తాడు.
ఆ ఆర్తనాదం విన్న పార్వతి దేవి బయటకు వచ్చి.. తన ఎదురుగా కనిపించిన దృశ్యం చేసి ఎంతో బాధపడుతుంది. ఆ బాలుడి పుట్టుక గురించి చెప్పి.. తనని బతికించమని వేడుకుంటుంది. దాంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. అతడికి గజాననుడు అని పేరు పెడతాడు. అనంతరం అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతారు పార్వతీపరమేశ్వరులు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
ఇక గణాధిపత్యం స్వీకరించిన గణేషుడిని దేవతలంతా ఆశీర్వదిస్తే.. శివుడి శిరస్సుపైన ఉన్న చంద్రుడు మాత్రం నవ్వుతాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయనే నానుడి ప్రకారం చంద్రుడి దిష్టి తగిలి వినాయకుడి ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని చంద్రుడిని శపిస్తుంది.
పార్వతీ చంద్రుని శపించిన సమయంలోనే సప్తరుషులు తమ భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి రుషిపత్నుల మీద మోహం కలిగింది. కానీ తన కోరిక తెలిస్తే..వారు శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. అయితే భర్త కోరిక తెలుసుకున్న అగ్ని దేవుడి భార్య స్వాహాదేవి రుషుల భార్యల రూపంలో భర్తను చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భావించిన రుషులు.. వారిని వదిలేస్తారు. ఇదంతా పార్వతీ దేవి శాపానికి గురైన చంద్రుడిని చూడటం వల్లే జరిగింది అని దేవతలు గుర్తిస్తారు.
దాంతో దేవతలు, బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు’ అని శాపాన్ని తగ్గిస్తుంది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇక భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడి ఆవు పాలను పితుకుతుండగా పాత్రలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందోనని భయపడసాగాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు అనే రాజు సూర్యుని వరంతో శమంతకమణిని పొందుతాడు. అది రోజుకు పది బారువుల బంగారాన్ని ఇస్తుంది. దాన్ని తీసుకుని సత్రాజిత్తు ద్వారకకు వెళ్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు తనకు ఆ మణిని ఇవ్వమని సత్రాజిత్తును కోరాడు. అందుకు అతడు ఒప్పుకోడు.
ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని వేటకు వెళ్తాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపుతుంది. మణిని నోట కరచుకుని వెళ్తున్న సింహాన్ని జాంబవంతుడు చూశాడు. దాంతో సింహాన్ని చంపి.. మణిని తీసుకుని వెళ్లి కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఇచ్చి ఆడుకోమంటాడు.
ఇదేం తెలియని సత్రాజిత్తు.. శ్రీకృష్ణుడే శమంతకమణి కోసం తన తమ్ముడిని చంపి, దాన్ని దొంగతనం చేశాడని ఆరోపిస్తాడు. ఇలా తనపై పడ్డ నిందను పోగొట్టుకోడానికి శ్రీకృష్ణుడు.. మణిని వెదుక్కుంటూ అడవులకు వెళ్లి.. అక్కడ జాంబవంతుడితో యుద్ధం చేసి తిరిగి దానిని సత్రాజిత్తుకు అప్పగించాడు. అంతడి శ్రీకృష్ణుడికే నీలాపనిందలు తప్పలేదు కనుక.. వినాయక చవితి నాడు చంద్రుడుని చూడకూడదు అంటారు.