అక్షయతృతీయ అంటే తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. ఇవాళ అందరూ బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఈరోజు బంగారం కొంటే అది అక్షయం అవుతుందని భావిస్తుంటారు. అయితే మీరు ఈరోజు బంగారం కొనుగోలు చేయకపోయినా కూడా మీ ఇంట్లో ఉండే బంగారంతోనే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు.
అక్షయతృతీయ అనగానే ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాల్లో బంగారం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. సాధారణంగా అక్షయతృతీయ అనగానే బంగారం కొనడమే అనుకుంటూ ఉంటారు. నిజానికి అక్షయతృతీయకు బంగారం తప్పకుండా కొనాలి అని పురాణాల్లో లేదంటూ పండితులు చెబుతుంటారు. దీని కోసం లేనిపోని అప్పులు చేసి కష్టాలపాలు కావద్దు అంటూ సూచిస్తున్నారు. అయితే అక్షయతృతీయ ఎంతో ప్రాముఖ్యమైన రోజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మీరు చేసే పుణ్య- పాప కార్యాలు రెట్టింపు ఫలితంతో మీకు చేరతాయని చెబుతుంటారు. అందుకే ఈ రోజు దాన ధర్మాలు చేస్తే మీకు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అక్షయతృతీయ రోజు తప్పుకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించాలి. మీకు నది దగ్గర్లో లేని పక్షంలో ఇంట్లో గంగాజలం కలుకుని అయినా తలంటు స్నానం చేయచ్చు. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పసుపు రంగు దుస్తులు ఉంటే వాటినే ధరించాలని చెబుతున్నారు. ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజకు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజలో కలశాన్ని కూడా ఉంచుతారు. కాబట్టి మంచి ముహుర్తంలో కలశ ప్రతిష్ట చేసుకోవాలి. ఏప్రిల్ 22, శనివారం ఉదయం 7.49 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు కలశ ప్రతిష్టకు మంచి సమయంగా చెబుతున్నారు.
ఈ రోజు మహావిష్ణువుని- లక్ష్మీదేవిని కలిపే పూజ చేయాలి. దీపావళి రోజు చేసే విధంగానే ఈరోజు కూడా సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకుంటారు. ఆ పూజలో మీరు అమ్మవారి విగ్రహం/చిత్రపటం ముందు మీ ఇంట్లో ఉండే బంగారాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా అక్షయతృతీయ రోజు కొత్తగా బంగారం కొనాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే మీరు సాయంత్రం పూట ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే శుభం కలుగుతుందని సూచిస్తున్నారు. స్తోమతకు మించి అప్పులు చేసి బంగారం కొనుగోలు చేసి కష్టాలు పడకండని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అక్షయతృతీయ రోజు మీరు ఏ పని చేస్తే.. అదే అక్షయం అవుతుందని చెబుతున్నారు.