సాధారణంగా చిన్న గుండు సూదీ గుచ్చుకున్నా.. తల దువ్వే సమయంలో కాస్త గట్టిగా లాగిన బాధతో విలవిల్లాడతాం. అలాంటిది తలలో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు 8 మేకులు దిగితే.. వామ్మో ఇంకేమైనా ఉందా.. ఈపాటికే ప్రాణాలు పోతాయి అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మృత్యుంజయుడు. తలలో ఎనిమిది మేకులు దిగినా.. తట్టుకుని నిలబడ్డాడు. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి.. తలలో దిగిన మేకులను తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు వైద్యులు. ఈ సంఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది.
డిసెంబర్ 18, 2021న 25 ఏళ్ల బాధిత యువకుడు ఓ చోట పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా.. డ్రిల్లింగ్ మెషన్ నుంచి అతడి తలలోకి 8 మేకులు దిగాయి. ఇది గమనించిన మిగతా వారు బాధితుడిని రాజస్తాన్ లోని జోధ్ పుర్ ఎండీఎం ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు అతడికి ఎక్స్ రే, సీటీ స్కాన్ నిర్వహించారు. రిపోర్టులో ఓ మేకు మెదడులోకి లోతుగా దిగినట్లు గుర్తించారు వైద్యులు. అనంతరం అత్యంతం జాగ్రత్తగా అతడికి ఆపరేషన్ చేశారు.
ఈ సందర్భంగా ఓ డాక్టర్ మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ చేసే సమయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఆ యువకుడి ప్రాణాలు పోవడమో.. లేక జ్ఞాపకశక్తి కోల్పోవడమే.. పక్షవాతానికి గురవ్వడమో జరిగేది. కానీ అదృష్టం కొద్ది ఆపరేషన్ విజయవంతం అయ్యింది. పది రోజుల పాటు అతడిని అబ్జర్వేషన్ లో ఉంచి.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశాం’’ అని తెలిపారు.