ఈ మధ్య కాలంలో హాస్టల్స్ లో ఉండే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. కారణం ఏదైనా గానీ బంగారం లాంటి తల్లిదండ్రులను వదిలేసి మధ్యలోనే వెళ్లిపోతున్నారు. అయితే ఈ సమస్యకు అధికారులు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. అదేంటంటే?
ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఎక్కువగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చదువు ఒత్తిడి కారణంగానో, ప్రేమ విఫలమైందనో పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్నారు. హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకోవడం అనేది సర్వ సాధారణమైపోయింది. దీన్ని ఆపేందుకు అధికారులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఫ్యాన్ కి తాడు లేదా ఇంకేదైనా కట్టి ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు గాల్లో వేలాడకుండా కిందకు సాగేలా స్ప్రింగ్ ఫ్యాన్ లను తీసుకొచ్చారు. రాజస్థాన్ లోని కోటాలో హాస్టల్స్ లో రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.
వీటిని అరికట్టడం కోసం అధికారులు హాస్టళ్లలో స్ప్రింగులు కలిగిన సీలింగ్ ఫ్యాన్స్ ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని చూస్తే వారి బరువుకి ఫ్యాన్ మరింత కిందకు దిగుతుందని అధికారులు భావించారు. అయితే కొందరు అధికారుల తెలివితేటలు బాగున్నాయని ప్రశంసిస్తున్నా కొందరు మాత్రం తెలివితేటలు తెల్లారినట్టే ఉంది అని అంటున్నారు. అసలు ఆత్మహత్యకు కారణం ఏంటో అనే విషయాన్ని గ్రహించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా.. ఇలా స్ప్రింగ్ ఫ్యాన్లు పెట్టడం ఎంతవరకూ సమంజసం అని కామెంట్స్ చేస్తున్నారు.