కరోనా కట్టడిలో సరికొత్త ప్రణాళిక – కాశీ మోడల్ !..

వారణాసి ప్రజలకు కొవిడ్‌కు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ ఒకేచోట సమాధానం లభించేలా ‘కాశీ కొవిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని వివిధ జిల్లాల్లో అధికారులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను క్రోడీకరించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వాటిని రాష్ట్రాలకు పంపించింది. ప్రధాని మోదీ ఈనెల 18, 20 తేదీల్లో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్‌లతో జరిపిన చర్చల సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని వివరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శుక్రవారం రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని అమల్లో పెట్టవచ్చని సూచించారు. కరోనా కట్టడికి కాశీలో అధికారులు, వైద్యనిపుణులు అనుసరించిన నమూనా గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలికాలంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆ విధానం వల్ల సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య నిలకడగా మారిందని ప్రశంసిస్తున్నారు. దాన్ని ‘కాశీ మోడల్‌’గా వ్యవహరిస్తున్నారు. అది ప్రధాని చాలాకాలంగా సూచిస్తున్న సూక్ష్మ కట్టడి జోన్ల ఏర్పాటు విధానమే.

swarajya 2019 10 dbbaebcd 0460 4de9 afe0 94a373592803 Ganga 1

కేసులు ఎక్కువగా వచ్చిన ఒక ప్రాంతాన్నో, కాలనీనో నిషేధిత జోన్‌గా ప్రకటిస్తే అది కట్టడి ప్రాంతం. అలా కాకుండా ఒక అపార్ట్‌మెంట్‌లో ఒకటి రెండు కేసులు వచ్చినా దాంట్లోంచి రాకపోకలను నిషేధిస్తే దాన్ని సూక్ష్మ కట్టడి ప్రాంతం అంటారు. అలా కరోనా పేషెంట్లను ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంచి, వారి గుమ్మం వద్దకే ఔషధాలను సరఫరా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగారు. దానిలో భాగంగా ఎవరైనా తమకు కరోనా సోకిందని తెలియగానే నిరంతరాయంగా పని చేసే ‘కాశీ కొవిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌’కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోన్‌కాల్‌ ఆధారంగా, పేషెంట్లు ఎక్కడున్నారో గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారమిస్తారు. వారు బాధితులను లక్షణాలున్నవారిగా, లక్షణాలు లేనివారిగా గుర్తించి లక్షణాల్లేనివారికి, స్వల్ప లక్షణాలున్నవారికి వైద్యులు ఇంటిదగ్గరే చికిత్స అందిస్తారు.