వేసవి సెలవులతో పాటు ఈ ఏడాది గంగా పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఏపీ రైలు ప్రయాణీకులకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. విశాఖ పట్నం నుండి వారణాసికి పలు రైళ్లను ప్రకటించింది.
ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వేలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ని రైళ్లు ఉన్నా.. పెరుగుతున్న జనాభాతో ప్రతి రైలు రద్దీగానే ఉంటుంది. ఇక డిమాండ్ ఉండే రూట్ల రైళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఇటువంటి రూట్లలో దృష్టి పెట్టిన కేంద్రం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకువచ్చింది. ఇవి పట్టాలపై వేగంగా దూసుకుంటూ వెళుతున్నాయి. తక్కువ సమయంలో గమ్య స్థానానికి ప్రయాణీకులు చేరుకుంటున్నారు. అయితే సామాన్యులు వీటిలో ప్రయాణించాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. ఇక రానున్నవి వేసవి సెలవులు కావడంతో మరింత రద్దీ పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రద్దీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ రైల్వే ప్రయాణీకులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
దేశంలో అతి పెద్ద జీవ నది గంగ. ఈ సంవ్సతరం గంగా పుష్కరాలు జరగనున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు పుష్కరాలు ఉండనున్నాయి. అయితే ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుండి యాత్రికులు హాజరువుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా భారీగా వస్తారు. అయితే పుష్కరాలతో పాటు వేసవి సెలవుల దృష్ట్యా ఏపీ ప్రజల కోసం కేంద్రం పలు రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది కేంద్ర రైల్వేశాఖ. ఇవి ఏప్రిల్ 19, 26 తేదీల్లో విశాఖ నుంచి బయల్దేరగా.. ఏప్రిల్ 20, 27 తేదీల్లో వారణాసి నుంచి తిరిగి వస్తాయి. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-వారణాసి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను మేలో 9, జూన్‌లో 9 సర్వీసులను నడుపనున్నారు.
విశాఖపట్నం నుంచి ప్రతీ బుధవారం వారణాసికి రైలు బయల్దేరనుండగా.. అటు తిరుగు ప్రయాణంలో వారణాసి నుంచి ప్రతీ గురువారం విశాఖకు రైలు బయల్దేరుతుంది. కాగా, వాల్తేరు డివిజన్ ఈ రెండు రూట్ల మధ్య ప్రత్యేక రైళ్ల కోసం కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించినప్పటికీ, బీజేపీ ఎంపీ జీవీఎల్ చొరవతో కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వీటిని వెంటనే కేటాయించారు. అటు గంగా పుష్కరాలకు, వేసవి సెలవులకు వెళ్లే యాత్రికుల కోసం సకాలంలో విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్ల మంజూరు చేయడంతో ఎంపీ జీవీఎల్.. కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.