పసికందు నుండి కాటికి కాళ్లు చాపే ముసలి వాళ్ల వరకు ఎవ్వరిని వదలడం లేదు కామాంధులు. ముఖ్యంగా అభం, శుభం తెలియని మైనర్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇంట్లో చెప్పలేక, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు గర్భం దాలుస్తున్నారు.
దేశంలో అమ్మాయిలుగా పుట్టడం పాపమైంది. పసికందు నుండి కాటికి కాళ్లు చాపే ముసలి వాళ్ల వరకు ఎవ్వరిని వదలడం లేదు కామాంధులు. ముఖ్యంగా అభం, శుభం తెలియని మైనర్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇంట్లో చెప్పలేక, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు గర్భం దాలుస్తున్నారు. ఆడ పిల్లలకు అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు ఆమెనే నిందిస్తూ ఇంట్లో నుండి గెంటేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రుల పరువు పోతుందని ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు కొంత మంది బాలికలు. ఈ విషయంలో బాధితులకు ఏం న్యాయం జరగడం లేదు. కేవలం నిందితులపై పోక్సో చట్టం బనాయించి.. చేతులు దులుపుకుంటున్నాయి చట్టాలు.
అత్యాచారానికి గురై, గర్భం దాల్చి, కుటుంబ సభ్యులు వదిలేసిన మైనర్లకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అటువంటి వారికి ఆర్థిక, వైద్య సాయం, మౌళిక సదుపాయాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. దీని కోసం నిర్భయ నిధుల్లో నుండి రూ. 74. 10 కోట్లను కేటాయించనున్నారు. అవాంఛిత గర్భం దాల్చిన అత్యాచార, సామూహిక అత్యాచార బాలికలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మైనర్ బాధితులకు సాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, చిన్నారుల సంక్షేమ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్టు, ఇందుకోసం మిషన్ వాత్సల్యను సిద్ధం చేస్తున్నట్టు స్మృతి ఇరానీ తెలిపారు. అత్యాచారానికి గురై.. కుటుంబం పట్టించుకోని బాలికలకు మాత్రమే ఈ సాయాన్ని పొందగలరు.
బాలికలకు షెల్డర్, భోజనం, నిత్యావసరాలు, కోర్టుకు వెళ్లేందుకు రవాణా చార్జీలు అందిస్తారు. సంరక్షణ కేంద్రాల్లో ఇతర బాలికలతో కాకుండా.. రేప్ బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అందిన సమాచారం ప్రకారం.. ఈ పథకం కింద బాధితులకు నెలకు రూ. 4 వేలు అందనున్నాయి. అదే సమయంలో పుట్టిన బిడ్డ వద్దు అనుకుంటే.. ద్తతత ఇచ్చేందుకు సాయం చేస్తారు. అలాగే బాలిక కోరిన విధంగా వైద్య సేవలు అందిస్తారు. 18ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికలు, కుటుంబాన్ని విడిచి పెట్టిన వారు.. వారితో కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న వారు, పోక్సో చట్టంలో సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 376, 376ఏ-ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న మైనర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీ లేని బాధితులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే ఈ పథకం ద్వారా బాలికకు సాయం చేయాలని బాధ్యత తీసుకున్న వారి దగ్గర మాత్రం సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీ ఉండాల్సిందే.