దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒకవైపు అన్నీ రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి కోవిడ్ నిబంధనలు కొనసాగుతోన్నా.., కేసుల సంఖ్యలో మాత్రం గణనీయమైన తగ్గుదల కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ మరణాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియని మరింత వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు ఫాస్ట్ గా 20కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలలో ఇండియా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈ లిస్ట్ లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మన స్వదేశీ వ్యాక్సిన్స్ యుద్ధ ప్రతిపాదికన సిద్ధం అవుతూనే ఉన్నా.., 130 కోట్లకి పైగా జనాభా ఉన్న దేశం కావడంతో ఇండియాకి వ్యాక్సిన్ కొరత ఎదురవుతూనే ఉంది. రాష్ట్రాలలో ఉండే అత్యవసర పరిస్థితిని బట్టి కేంద్రం ఆయా రాష్ట్రాలకి వ్యాక్సిన్స్ సర్దుబాటు చేస్తూ వస్తోంది. మరోవైపు ఇండియాకి థర్డ్ వేవ్ ముప్పు ఎలానో పొంచి ఉంది. థర్డ్ వేవ్ అంటూ వస్తే.. చిన్న పిల్లలకి అత్యధిక ప్రమాదం అంటూ వైద్య నిపుణులు చేస్తున్న సూచనలు భయాందోళనకి గురి చేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ప్రపంచదేశాల నుండి వ్యాక్సిన్స్ తెచ్చుకోక తప్పని పరిస్థితిలు నెలకొని ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్లు ఈ బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాయి. ప్రత్యేక సరుకు రవాణా విమానంలో ఏకంగా 56.6 టన్నుల వ్యాక్సిన్లు హైదరాబాదుకు చేరాయి. ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ లలో ఇదే అతి పెద్ద డీల్. అయితే.., ఈ వ్యాక్సిన్స్ నేరుగా రష్యా నుండి ప్రత్యేకించి హైదరాబాద్ కే చేరుకోవడానికి కారణం లేకపోలేదు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ లను ప్రత్యేకంగా నిల్వచేయాల్సి ఉంటుంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్పుత్నిక్ వ్యాక్సిన్లను స్టోర్ట్ చేయాలి. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఫార్మా జూన్ టెర్మినల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలు మున్ముందు మూడున్నర బిలియన్ డోసుల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తాయి. ఇక వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం లేదా వ్యాక్సిన్లు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫార్మా కార్గో ప్రత్యేకమైన టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటి టెర్మినల్ దేశంలోనే మొదటిది. పైగా.., ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విమానాశ్రయాన్ని సర్టిఫై చేసింది. ఔషధాల నిల్వా, పంపిణీలో మెరుగైన పద్ధతులు పాటిస్తున్నారు ఎయిర్ కార్గో టెర్మినల్ గా కితాబిచ్చింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి హైదరాబాద్ కి 56.6 టన్నుల వ్యాక్సిన్స్ వచ్చాయి. అయితే.., వీటి వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సొంత హక్కులు ఉండవు. ఈ డీల్ దేశాల మధ్య జరిగినది కాబట్టి.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉన్న ఈ వ్యాక్సిన్స్ ని కేంద్రమే స్వయంగా అత్యవసరమైన రాష్ట్రాలకి అందించనుంది.