రచిన్ రవీంద్ర ఎవరో తెలుసా.. సచిన్, ద్రవిడ్ తో లింక్ ఏంటీ

ఇంటర్నేషనల్ డెస్క్- రచిన్ రవీంద్ర.. ఈ పేరు ఎపుడైనా విన్నారా.. అదేంటీ సచిన్ టెండుల్కర్ లా ఈ రచిన్ రవీంద్ర ఏంటీ.. ఇంతకీ ఎవరితను అని అనుకుంటున్నారు కదా.. బుధవారం న్యూజిలాండ్‌ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ చూసిన వారు రచిన్ రవీంద్ర పేరు టీవీలో చదవడమే కాదు.. ఆయనను చూసే ఉంటారు. టీ20 మ్యాచ్ లో రచిన్‌ రవీంద్ర అనే పేరు ఆసక్తికరంగా కనిపించింది.

న్యూజిలాండ్‌ తరపున 6 టి20 మ్యాచ్‌ లు ఆడిన రచిన్‌ రవీంద్ర 54 పరుగులు చేశాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌ రంగంలో పైకి వస్తున్న రచిన్ భారత మూలాలున్న కుటుంబానికి చెందిన ఆటగాడు.1990ల కాలంలోనే రచిన్‌ రవీంద్ర కుటుంబం న్యూజిలాండ్‌ లో స్థిరపడింది. తండ్రి రవి కృష్ణమూర్తి సాఫ్ట్‌ వేర్‌ ఆర్కిటెక్‌గా పనిచేసేవాడు. రచిన్‌ రవీంద్ర పుట్టక ముందు బెంగళూరులో ఉన్న కృష్ణమూర్తి కుటుంబం తర్వాత న్యూజిలాండ్‌ కు వెళ్లి స్థిరపడింది.

Rachin 1

న్యూజిలాండ్ లో హట్‌ హాక్స్‌ పేరుతో క్రికెట్‌ క్లబ్‌ను ప్రారంభించాడు కృష్ణమూర్తి. తండ్రి నుంచి వారసత్వంగా క్రికెట్‌ లక్షణాలను పునికి పుచ్చుకున్న రచిన్‌ రవీంద్ర నవంబర్‌ 18, 1999న జన్మించాడు. అతని తండ్రి కృష్ణమూర్తికి సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ లంటే అభిమానం ఉండడంతో వారిద్దరి పేర్లు కలిసి వచ్చేలా రచిన్‌ రవీంద్ర అనే పేరు పెట్టాడట. అదన్న మాట సంగతి.

అన్నట్లు రచిన్‌ రవీంద్ర మొదటిసారి న్యూజిలాండ్‌ తరపున 2016 అండర్‌ 19 ప్రపంచకప్‌ లో ఆడాడు. ఆ తరువాత 2018 అండర్‌ 19 ప్రపంచకప్‌ లో ఆడిన రచిన్‌ రవీంద్ర, 2021 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌ తో జరిగిన టి20 మ్యాచ్‌ ద్వారా కివీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌ లోకి ప్రవేశించాడు. మరోవైపు ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ కు న్యూజిలాండ్‌ జట్టులోకి ఎంపికయ్యాడు రచిన్ రవీంద్ర.

తన బ్యాటింగ్‌ ఐడల్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని చెప్పిన రచిన్, సచిన్ ఆట చూస్తూ పెరిగానని ఓ సందర్బంలో చెప్పాడు. అంతర్జాతీయంగా ఆరు మ్యాచ్‌ లాడిన రచిన్‌ రవీంద్ర, 54 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 6 వికెట్లు తీశాడు. అంతే కాదు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 26 మ్యాచ్‌ ల్లో 1470 పరుగులతో పాటు 22 వికెట్లు తీశాడు.