ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను, ఏపీలో భారీ వర్షాలు

cyclone

విశాఖపట్నం- ఇప్పటికే కరోనా అతలాకుతలం చేస్తోంటే.. దీనికి తోడు మరోవైపు తుఫాను ముంచుకొస్తోంది. దీంతో ప్రజలతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఈ తుఫాన్‌కు మయన్మార్‌ తౌక్టే పేరుని పెట్టాలని నిర్ణయించారు. తౌక్టే తుఫాను ఈ నెల 18 నాటికి గుజరాత్‌ దగ్గర తీరం దాటుతుందని, ఐతే కచ్చితంగా ఎక్కడ తీరం దాటుందనేది ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నామని ఐఎండీ తెలిపింది. తౌక్టే తుఫాను ప్రభావం ఆంద్రప్రదేశ్ పై పెద్దగా ఉండబోదని అధికారులు చెబుతున్నారు. కానీ బంగాళాఖాతం నుంచి తేమ గాలుల్ని అల్పపీడనం తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు. దీంతో మూడు రోజుల పాటు రాయలసీమలో జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఈ తుఫాన్‌ నైరుతి రుతుపవనాల రాకపై ఏమాత్రం ప్రభావం చూపదని, రుతు పవనాలు సాధారణంగా జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. ఐతే తౌక్టే తుఫాను వల్ల రెండు మూడు రోజుల ముందే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో తేమ గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలవైపు విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విస్తాయని వెధర్ రిపోర్ట్ చెబుతోంది. అంతే కాదు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా కుందుర్పిలో 4 సెంటీ మీటర్లు, కల్యాణదుర్గం, రాయదుర్గం, సెత్తూరులో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 15, 16న ఆంద్రప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని తెలుస్తోంది.