స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడం సంచలనంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హైదరాబాద్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముందు కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించిన హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, ఆ తర్వాత తుది జట్టులో కూడా స్థానం ఇవ్వలేదు.
వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా టీమ్‌ని లీడా చేశాడు. అయినప్పటికీ హైదరాబాద్ గెలుపు బాట పట్టలేకపోయింది. తనను కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించినా కూడా మౌనంగా ఉండి, జట్టుని సపోర్ట్ చేస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్, టోర్నీ ముగిసిన తర్వాత మొదటిసాకి పెదవి విప్పాడు. తన పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆవేధన వ్యక్తం చేశాడు.
డేవిడ్ వార్నర్ ఏమన్నారంటే.. కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఐతే అలా ఎందుకు తప్పించారో కనీసం కారణం కూడా నాకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ చెప్పలేదు.. జట్టు ఓనర్స్ తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, బేలిస్ పై నాకు గౌరవం ఉంది.. టీమ్ పరంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే.. అది కచ్చితంగా ఏకగ్రీవంగానే తీసుకుని ఉంటారని అనుకుంటున్నాను.. అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఏమన్నారంటే.. కానీ నన్ను కెప్టెన్సీ నుంచి, ఆ రువాత జట్టు నుంచి తప్పించడానికి గల స్పష్టమైన కారణాన్ని మాత్రం వారు చెప్పకపోవడం నన్ను చాలా బాధించింది. ఒక వేళ నేను ప్రశ్నించినా ఆ ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదని నాకు తెలుసు. అందుకే అన్నీ మరిచి ముందుకు సాగిపోవాలంతే.. అని డేవిడ్ వార్నర్ చెప్పాడు.
ఐపీఎల్ 2021 సీజన్‌లో 8 మ్యాచ్ లు ఆడిన డేవిడ్ వార్నర్ 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నా, కనీసం ఒక్కటి కూడా గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో మొదటిగా ఆడిన ఆరు మ్యాచ్ లకిగానూ ఐదింట్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచే కాకుండా జట్టుని కూడా తప్పించారు.