అమరావతి- ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి భహిరంగ సవాల్ విసిరారు. చెంచాలతో మాట్లాడించడం కాదు, జగన్ రెడ్డి దమ్ముంటే నువ్వు రా అంటూ సవాల్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుపెట్టుకుని పల్నాడులో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
గుంటూరు జిల్లాలో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య అంత్యక్రియల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన తరువాత, గుండ్లపాడుకు తరలించారు. చంద్రయ్య అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు, స్వయంగా ఆయన పాడె మోశారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చంద్రయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
ఈ సందర్బంగా ఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. చంద్రయ్య హత్య బాధాకరమని, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. రౌడీలపై పోరాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అన్న చంద్రబాబు, హత్యా రాజకీయాలను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని చెప్పారు. సీఎం జగన్ జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని చంద్రబాబు హెచ్చరించారు.
స్థానికంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చంద్రయ్య ధ్యేయమని గుర్తు చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రావాల్సిన తాను.. ఇలా చంద్రయ్య అంత్యక్రియలకు రావాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు బరితెగించారని, నేరస్థులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో ప్రజామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
అన్నట్లు టీడీపీ నేత చంద్రయ్య గురువారం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరగా, అతని కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్‌కు కర్ర అడ్డు పెట్టి కిందపడేలా చేశారు. అనంతరం అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.