చంద్రబాబు కన్నీళ్లు చూసి ప్రభుత్వ మహిళా ఉద్యోగి రాజీనామా

కడప రూరర్- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసరికి చాలా మంది చలించిపోతున్నారు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రిజైన్ చేయడం సంచలనం రేపింది. ఇదిగో ఇప్పుడు కానిస్టేబుల్ మాదిరిదానే మరో మహిళా ప్రభుత్వ ఉద్యోగి నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాకు చెందిన మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.

chandrababu naidu crying

కడప జిల్లా రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ కో ఆర్డినేటర్‌ గా పని చేస్తోంది. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చలించిపోయిన దీప్తి ఆదివారం తన తండ్రి, మాజీ శాప్‌ డైరెక్టర్‌ జయచంద్రతో కలిసి రైల్వేకోడూరులోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. తన రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహనికి క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించారు.

తనకు 2014లో ఈ ఉద్యోగం వచ్చిందని అనితా దీప్తి తెలిపారు. ఐతే అసెంబ్లీ పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయి ఆమె చెప్పారు. 2024లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు కష్టపడి తనవంతుగా పనిచేస్తానని ఆమె అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాకే తాను మళ్లీ ఏదో ఉద్యోగంలో చేరతానని చెప్పారు. అనితా దీప్తి ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.