వరల్డ్ బ్యాంకుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. 50 లక్షల మంది విధ్యార్ధులకు ప్రయోజనం

అమరావతి- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ కు ప్రపంచ బ్యాంక్‌ చేయూతనందిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ విజన్‌ కు సహకారం అందించడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది.

ఈమేరకు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో అంద్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 50 లక్షల మంది విద్యార్థుల ప్రమాణాల పెంపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం 250 మిలియన్ డాలర్లను సమకూర్చనుంది ప్రపంచ బ్యాంక్. ఈ ప్రత్యేక ప్రాజెక్టు ద్వార ఏపీలోని సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు, అంగన్ వాడి సిబ్బందికి ప్రయోజనం కలగనుంది.

World Bank 1

టీచర్లలో నైపుణ్యం పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అంతే కాదు ఈ ప్రాజెక్ట్‌ లో పేద, గిరిజన విద్యార్థులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. అంగన్ వాడి టీచర్లకు, సిబ్బందికి స్పెషల్ ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ వసతులు లేక విద్యలో వెనకబడిపోతున్న పేద, గిరిజన విద్యార్థుల కోసం టెలివిజన్, రేడియోలో ప్రత్యేక కంటెంట్ రూపకల్పన చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇప్పటికే స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం బోధించడంతో పాటు పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చేస్తున్న జగన్ సర్కార్ కు ప్రపంచ బ్యాంక్‌ సాయం మరింత చేయూతనివ్వబోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, గిరిజన విధ్యార్ధుల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. దీంతో విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.