తాడేపల్లిలో సీఎం ఇంటి సమీపంలో అందరినీ ఆకట్టుకుంటున్న గోశాల

Jagan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం పరిపాలనకు సంబంధించిన విషయాల్లో తీరిక లేకుండా ఉంటారు. అవకాశం ఉన్నప్పడు కొన్ని ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తుంటారు. తాడేపల్లిలోని తన ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన గోశాలను సీఎం జగన్ సందర్శించారు. ఈ గోశాలను  సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించారు. పల్లెటూరు వాతావరణం కనిపించేలా గోశాల నిర్మాణం జరిగింది. గోశాలను మట్టిపెంకులు, వెదురు బొంగులు, తడికెలతో ఏర్పాటు చేశారు.

ఈ గోశాల చాలా ఆకర్షణీయంగా ఉందంటున్నారు స్థానికులు. గోశాల బయట విశాల ప్రాంగణం ఉంది. గోవులు నీరు తాగేందుకు ఆరుబయట పెద్ద కొలను ఏర్పాటు చేశారు. ఆవులు మేసేందుకు.. పచ్చికబయళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, చల్లని గాలి, నీడ కోసం పచ్చని చెట్లను కూడా నాటారు. ఈ పచ్చని చెట్లు, నీటి కొలనుతో గోశాల చూడచక్కగా ఉంది. ఆహ్లాదకరంగా ఉన్న గోశాలను ఆసక్తిగా తిలకించారు సీఎం జగన్.

ఈ గోశాలకు వివిధ ప్రాంతాల నుంచి పలు జాతుల ఆవులను తీసుకొచ్చారు. అరుదైన ‘గిర్’ జాతి ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పలు గోవులను ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చారు. గోశాలలో చాలా సమయం కలియతిరిగిన సీఎం జగన్ అనంతరం గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోశాల నిర్మించిన తీరు, గోవులకు కల్పించిన సౌకర్యాల గురించి సీఎం అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.