ప్రస్తుతం ఏపీలో ఆహా క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ ధరకు పేద ప్రజలకు పట్టణాల్లో క్యాంటీన్ ద్వారా రుచికరమైన భోజనం అందుతుంది. అయితే దీని వల్ల ఎవరికి లాభం?
ఆహా క్యాంటీన్.. పేరుకు తగ్గట్టే ఆహా అనిపించే రుచికరమైన, శుచికరమైన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తున్నారు. భోజనం మాత్రమే కాదు, అల్పాహారం కూడా అందిస్తున్నారు. ఈ ఆహా క్యాంటీన్ల ద్వారా రూ. 10కి టిఫిన్, రూ. 40కి భోజనం అందిస్తున్నారు. నగరిలో మంత్రి రోజా ఇటీవలే మొదటి ఆహా క్యాంటీన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇంకా 110 మున్సిపాలిటీల్లో 140 ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి క్యాంటీన్లను పెంచుతామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అసలు ఈ ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం? ఈ క్యాంటీన్ల వల్ల ఎవరు లాభం పొందుతారు?
ప్రభుత్వ ఆధీనంలో పని చేసే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మానే ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. పట్టణాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సాధ్యమైనంత వరకూ ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో మెప్మా పని చేస్తుంది. అందుకోసం ఆహా క్యాంటీన్ల ఏర్పాటుకు నడుం బిగించింది. హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, రద్దీ ఏరియాల్లో మరిన్ని ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మెప్మా సంబంధిత సంస్థల అనుమతులు కూడా తీసుకుంది. సంఘ సభ్యులకు ఆహా క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తుంది. అంతేకాదు.. ప్రతి నెలా రూ. 500 చొప్పున క్యాంటీన్ నిర్వాహకుల నుంచి పట్టణ మహిళా సమాఖ్యల సొసైటీలో జమ చేసి ఆ డబ్బుతో మరింత మందికి ఉపాధి చూపించనున్నారు.
అంటే ఈ మిషన్ ద్వారా మహిళలు లాభపడనున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 15 రోజుల క్రితం మెప్మా సహకారంతో ముగ్గురు మహిళా సభ్యులు కలిసి ఆహా క్యాంటీన్ ను ప్రారంభించారు. సాయంత్రం జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం అమ్ముతున్నారు. కేవలం రెండున్నర గంటలు అమ్ముతూ రూ. 3 వేలకు పైగా సంపాదిస్తున్నారు. ఒకొక్కరూ రూ. వెయ్యికి పైనే సంపాదిస్తున్నారు. ఇది ఒక పూట మాత్రమే. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. పెద్ద పెద్ద డిగ్రీలు లేకుండా సొంత ఊరిలో ఉంటూ రోజుకు వెయ్యి చొప్పున నెలకు రూ. 30 వేలు సంపాదించే అవకాశం ఇంకెక్కడైనా దొరుకుతుందా? కాబట్టి ఆహా క్యాంటీన్ వల్ల పట్టణాల్లో ఉండే మహిళలు లాభపడతారు.
పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదవారికి లాభం చేకూరుతుంది. అలానే తమ పంటను పట్టణాల్లో అమ్ముకునేందుకు వచ్చే రైతులు, వ్యాపారులు కూడా తక్కువ ధరకు ఈ క్యాంటీన్లలో కడుపునిండా తినచ్చు. కూలి పనులు చేసుకునేవారు, ఆటోడ్రైవర్లు ఇలా ఎవరైనా గానీ తక్కువ ధరకే టిఫిన్ భోజనం తినే అవకాశం కల్పిస్తుంది. అది కూడా ఇంటి దగ్గర వండిన వంటకాలు. అవును ఈ వంటకాలను స్వయంగా మహిళలే వండి.. వారికి కేటాయించిన కియోస్కోల్లో విక్రయిస్తారు. ఇటు మహిళలకు ఉపాధి, అటు రైతులకు, చిరు వ్యాపారులకు, కూలీలకు లాభం చేకూరుతుంది.
తక్కువ ధరలో ప్రజలకు మంచి రుచికరమైన, శుచికరమైన ఆహరం అందించడమే లక్ష్యంగా మెప్మా పని చేస్తుంది. అయితే ఈ ఆహా క్యాంటీన్ల లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు. అయితే నెలకు రూ. 500 చొప్పున నిర్వాహకులు టౌన్ లెవల్ ఫెడరేషన్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఆ డబ్బును మళ్ళీ సంఘ సభ్యులే రుణాలుగా తీసుకుంటారు. అంటే ఆహా క్యాంటీన్ ద్వారా జనరేట్ అయిన సంపద మళ్ళీ సంఘ సభ్యులకే వెళ్తుంది. ఈ మొత్తం నిర్వహణను మెప్మా సిబ్బంది పర్యవేక్షిస్తారు.
దీని వల్ల పేద ప్రజలకు తక్కువ రేటుకి మంచి భోజనం అందించినట్టు ఉంటుంది. పట్టణాల్లో ఆసుపత్రులకు వచ్చే పేదవారు అన్నం తినడానికి ఆలోచించే పరిస్థితి. ఆ రేట్లు చూసి కడుపు నింపేసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆహా క్యాంటీన్ వారి పాలిట వరంగా మారుతుంది. కూలీలు, రైతులకు ఇలా ఎందరికో ఉపయోగపడుతుంది. ఇలా రాష్ట్రమంతా ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుంది. మరోవైపు ఎంతోమంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. మరి ఇంతమంది ఆనందాలకు కారణమైన ప్రభుత్వానికి ఏం లాభం లేకుండా ఉంటుందా చెప్పండి. ప్రజల మద్దతు అనే లాభం ఉంటుంది ప్రభుత్వానికి.