వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్

jagan 5lakh

ఏపీలో కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. పలు చోట్ల మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొందరు మరణించారు. ఈ నేపథ్యంలో వరదలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.

వరద ప్రభావిత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్లతో  సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని అధికారలను సీఎం ఆదేశించారు. అదే విధంగా ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు తక్షణ సాయం అందించాలని, వారిని ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని తెలిపారు. చెరువులకు, అనకట్టలకు గండి పడినచోట మరమ్మతులు చేయాలని చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా చర్యాలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. తిరుపతిలో తీవ్రస్థాయిలో నీటి నిల్వకు కారణాలపై అధ్యాయనం చేయాలన్నారు.