తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దంచి కొడుతున్న వానలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగలు ఉప్పొంగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో డీజీపీ పలు సూచనలు చేశారు.
గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు మత్తడిపోస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లతున్నాయి. నదుల్లో ప్రవాహం ప్రమాదకర స్తాయికి చేరుకుంటోంది. అతిగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుని నిండుకుండల్లా మారాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వరదల ధాటికి వంతెనలు కూలిపోయి, రోడ్లు తెగిపోయి రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంబించిపోయింది. ఈ క్రమంలో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ తో పాటు పలుజిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తయ్యారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, లేదంటే ఇళ్లకే పరిమితం అవ్వాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా టీఎస్ డీజీపీ అంజనీకుమార్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. వరదలు ముంచెత్తుతున్న తరుణంలో సెల్పీల కోసం వాగులు జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని సూచించారు. భారీగా గాలులు వీస్తుండడంతో చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోతున్నాయి వీటిపట్ల ప్రజలు అప్పమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.
జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నామని, దీనికోసం ప్రత్యేక ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. గురువారం ఉదయం నాటికి 2900 మందిని రక్షించి, పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఇక భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లి గ్రామం వాగు ఉదృతికి వరదలో చిక్కకుంది. సుమారు 1500 మంది గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కొందరు చెట్లపైన, డాబాలపైన తలదాచుకుంటున్నారు. ఇక్కడ వరదలకు చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్‌పై వరద నీరు కూడా కంట్రోల్‌లో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలతో వస్తున్న వరదల వల్ల ఎదురవుతున్నఇబ్బందులను చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లాపై పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నామని అంజనీ కుమార్ వెల్లడించారు.