అది అందమైన గ్రామం.. రాత్రికి ఉరంతా మాయం.. 200 ఏళ్ల మిస్టరీ

khuldhara village

స్పెషల్ డెస్క్- ఆ మిస్టరీ జరిగి ఇప్పటికీ రెండు వందల సంవత్సరాలు అవుతోంది. ఆ గ్రామంలో రాత్రి పడుకున్న వారంతా తెల్లారేసరికి మాయమైపోయారు. ఇళ్లు, ఇళ్లలోని వస్తువులన్నీ అలాగే ఉన్నా, కేవలం మనుషులు మాత్రం మాయమవ్వడం మిస్టరీగా మారింది. ఐతే రెండు వందల ఏళ్ల నుంచి ఈ మిస్సింగ్ మిస్టరీ మాత్రం వీడటం లేదు. ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం రాజస్థాన్ వెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన జైసల్మీర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందీ ఘోస్ట్ టౌన్.. దీన్నేకుల్‌ ధారా అని పిలుస్తారు. 200 ఏళ్ల క్రితం సందడిగా ఉన్న కుల్‌ ధారా ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ ఊరు మాయమైన సమయంలో 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాలను రాజులు పాలించేవారట. ఆ సమయంలో జైసల్మీర్ దివాన్‌గా సలీమ్ సింగ్ ఉండేవాడు.

khuldhara

అతనో పెద్ద దఉర్మార్గుడు.. డబ్బు పిచ్చి ఉన్నవాడు. ప్రజలపై అధిక పన్నులు వేసి రక్తం పీల్చేవాడు. అలాంటి దివాన్ కన్ను కుల్‌ ధారా గ్రామ పెద్ద కుమార్తెపై పడిందట. ఆమెను తన వద్దకు పంపాలని దివాన్ ఆజ్ఞాపించాడట. దానికి గ్రామ పెద్ద అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన సలీమ్ సింగ్, గ్రామ పెద్ద గనుక అతని కుమార్తెను తన వద్దకు పంపకపోతే హింసించి చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ గ్రామస్థులు అంతా ఒక్కచోట సమావేశమయ్యారు. తమ ఉరి ఆడబిడ్డను రక్షించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే ఆ గ్రామాన్ని ఖాళీ చేసేశారు. ఐతే వాళ్లు ఎక్కడికి వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.

సలీమ్ సింగ్ అంతటా వెతికించినా వారి ఆ ఉరి వాళ్ల జాడ మాత్రం కనిపెట్టలేకపోయాడు. గ్రామం వదిలి వెళ్లే సమయంలో తాము సుఖంగా జీవించలేకపోయిన ఈ గ్రామంలో మరెవరూ ఉండలేరని శపించారని చెప్తారు. ఆ భయంతోనే ఇన్నేళ్లయినా ఈ గ్రామంలో ఎవరూ ఉండటం లేదు. ఈ గ్రామం చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉంటుంది. సాయంత్రమైతే చాలు ఆ గోడకు ఉన్న గేటు మూసేస్తారు. దీనిలోకి ఎవర్నీ వెళ్లనివ్వరు. గ్రామంలో ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి చూస్తే గ్రామం మొత్తం కనబడుతుంది. ప్రస్తుతం ఈ గ్రామం భారత ఆర్కియాలజీ విభాగం ఆధీనంలో ఉంది. దీన్ని వారసత్వ సంపదగా గుర్తించిన ప్రభుత్వం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది.