సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా శాస్త్రానికి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు మనిషి పుట్టుక గురించే శాస్త్రం సరిగా వివరించలేకపోయింది. ఇక సైన్సకి అంతుపట్టని రహస్యాలు ఈ సృష్టిలో కోకొల్లలు. ఇలా శాస్త్రం వివరించలేని ప్రతి దాన్ని మనం దేవుడితో ముడి పెట్టేస్తాం. ఈ క్రమంలో కేరళలోని ఓ గ్రామం సైంటిస్టులకు సవాలుగా మారింది. ఆ ఊరిలో ఉన్న మిస్టరీ ఏంటో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు. గర్భం దాల్చిన మహిళ కవలలకు జన్మనివ్వడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్తలో.. ఆ గ్రామంలో ఏ ఇంట చూసిన కవలలే దర్శనం ఇస్తారు. తల్లులు ఇలా పదే పదే కవలలకు జన్మనివ్వడానికి గల కారణాలు ఏంటి.. అసలు ఈ గ్రామంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా లాభం లేకుండా పోయింది. ఇక ఈ గ్రామంలోని కవలలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు. ఆ వివరాలు..
కేరళలోని మలప్పురం జిల్లాలోని కోడిని గ్రామం గురించి ఇప్పడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ గ్రామానికి చెందిన కవలలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ గ్రామ జనాభా 2000 కాగా.. 1/5వ వంతు అనగా.. సుమారు 400 మంది కవలలే దర్శనం ఇస్తారు. ఈ క్రమంలో ఒక్క గ్రామంలోనే ఇంత మంది కవలలు ఉండటం చర్చనీయాంశమైంది. పైగా ఈ గ్రామంలోని చాలా కుటుంబాల్లో కవలలు మాత్రమే పుడతారు. తొలి సారి గర్భం ధరించినప్పుడే ఇలా జరుగుతుందా అంటే కాదు. రెండో, మూడోసారి గర్భం ధరించిన వారికి కొందరికి ఇలానే కవలలు జన్మించారు. దాంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
అయితే గ్రామంలో ఇంత మంది కవలలు ఎందుకు పుట్టారు.. కేవలం ఈ గ్రామంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకునేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చారు. ఈ కవలల నుంచి నమూనాలు సేకరించారు. కానీ వారందరిలో ఎలాంటి తేడా లేదు. ఇతరులతో సమానంగా ఉంటున్నారు. అయితే ఈ గ్రామంలో గాలి, తాగునీరు ఇందుకు కారణమని కొందరు అంటున్నారు. పరిశోధనా బృందం.. కవలల భౌతిక నమూనాలను మాత్రమే కాక.. ఆ గ్రామ ప్రజలు తినే ఆహారాలు, వారి అలవాట్లు, వారి జీవనశైలిని అధ్యయనం చేశారు. అయితే, ఇలా కవలలు జన్మించడానికి గల కారణాన్ని వారు గుర్తించలేకపోయారు. ఇది ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగా ఉండి పోయింది.
ఇక ఈ ఊరిలో గాలి, నీళ్లలో ఏదో ఉందని, దీని వల్ల ఇక్కడే ఎక్కువ మంది ఇళ్లలో కవల పిల్లలు పుట్టారని పలువురు అంటున్నారు. అయితే, దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇలా కవలలు జన్మించడం తమ గ్రామానికి దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నారు గ్రామస్తులు. ఇక ఇక్కడ ఉండే కవలలను చూడ్డానికి దూరం ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.