“పుష్ప” రెండు పార్ట్స్ గా ఎందుకు తీస్తున్నారో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగా హీరో అనే ట్యాగ్ తో మొదలైన ఆయన ప్రయాణం.., తక్కువ కాలంలోనే ఐకాన్ స్టార్ అనిపించుకునే స్థాయికి చేరింది. “అలా వైకుంఠపురములో” మూవీతో బన్నీ సృష్టించిన ఇండస్ట్రీ రికార్డ్స్ అందరికీ తెలిసిందే. దీని తరువాత అల్లువారబ్బాయి ప్రస్తుతం పుష్ప మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. అయితే.., తాజాగా పుష్ప మూవీని రెండు పార్ట్స్ గా తెరకెక్కించబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీనితో.., ముందుగా లేని ఈ ఆలోచన మధ్యలో ఎందుకు వచ్చింది? కథలో ఏమైనా మార్పులు జరిగాయా? అసలు పుష్ప షూటింగ్ అనుకున్నట్టే జరుగుతోందా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే.., పుష్పని రెండు భాగాలుగా విడుదల చేయాలన్న ఆలోచన వెనుక అసలు కారణాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి.

నిజానికి పుష్ప కథ కోసం సుకుమార్ చాలా బ్యాగ్రౌండ్ వర్క్ చేశాడు. తాను అనుకున్న కథ అనుకున్నట్టు చెప్పాలంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుందని ముందుగానే ఉహించాడు. దీనితో.. పుష్ప పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలయింది. కానీ.., ఇక్కడ నుండే అసలు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కరోనా ఈ సినిమా షూటింగ్ కి రెండుసార్లు బ్రేకులేసింది. ఇక్కడే కొన్ని కోట్లు రూపాయలు వృధా అయిపోయాయి. తర్వాత షూట్ చేసిన సన్నివేశాలకు కూడా అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చే అయింది. సినిమా అంతా అయ్యేసరికి బడ్జెట్ హద్దులు దాటేయడం ఖాయమని మేకర్స్ కి అర్ధం అయిపోయింది. మరోవైపు కథని చెప్పడంలో సుకుమార్ మిస్టర్ పెర్ఫెక్ట్. సో.., రాజీ పడలేకపోయినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితిల్లో బడ్జెట్ కాస్ట్ కటింగ్ లేకుండా పుష్పని రెండు భాగాలుగా విడుదల చేయాలన్న ఆలోచనకి వచ్చాడట సుకుమార్. ఇందుకు సంబంధించిన నేరేషన్ కూడా విడిగా నిర్మాతలకి ఇచ్చాడట సుక్కు. దీనితో కమర్షియల్ గా సక్సెస్ అయిపోవచ్చన ఆలోచనతో మైత్రి మూవీ మేకర్స్ కూడా సుకుమార్ ఆలోచనకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి.., బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 పార్ట్శ్ ఆలోచన ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.