అద్భుతమైన శివాలయం! రాత్రి తర్వాత ఎవరికీ కనిపించదు!

Sivalayam

హరహర మహాదేవ శంభోశంకర.. అనగానే పలికేవాడు. శంకర అనగానే ముందు వెనుక చూసుకోకుండా ప్రత్యక్షమయ్యే నీల కంఠుడు. అడింగిదే తడవుగా కోర్కెలు తీర్చే భోళా శంకరుడు. దేవాలయాలు అన్నింటిలో శివాలయాలకు ప్రత్యేకతలు ఉంటాయి. ఒక్కో శివాలయంలో ఒక్కో వింత దాగుంటుంది. ఆ కోవకు చెందిందే.. ఈ శివాలయం కూడా. ఈ శివాలయం సముద్ర గర్భంలో ఉంటుంది. అక్కడికి భక్తులకు అనుమతి ఉంటుంది. కానీ, అందుకు ప్రత్యేక ప్రవేశ సమయాలు ఉంటాయి. అక్కడి శివయ్య మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. అప్పటి వరకు మాత్రమే భక్తుల కోర్కెలు వింటాడు, కటాక్షిస్తాడు.

అదెక్కడో కాదు.. గుజరాత్‌ రాష్ట్రంలోని భావనగర్‌ కు కిలోమీటరు దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం రాత్రి 10 గంటలు దాటితే ఎవరికీ కనిపించదు. ఆలయంలోకి ప్రవేశించాలంటే మళ్లీ తర్వాతి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఆగాల్సిందే. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో మీరు ఆ ఆలయాన్ని దర్శించుకోవచ్చు, ఆ భోళా శంకరుడికి మీ కోర్కెలను మొర పెట్టుకోవచ్చు. అదే అక్కడి విశేషం.

సముద్ర గర్భంలోకి అంటే సామాన్యమైన లోతు కాదులెండి.. పగటి పూట కేవలం అక్కడి ధ్వజస్తంభం పైభాగం మాత్రమే కనిపిస్తుంది. అక్కడి దాకా నీళ్లు వచ్చేస్తాయి. ఆ ధ్వజస్తంభం ఎత్తు అంతా ఇంతా కాదు.. దాదాపు 20 మీటర్లు ఉంటుంది. అంటే ఆ ఎత్తు వరకు సముద్రం ముందుకు వస్తుంది. మళ్లీ యథావిధిగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సముద్రం వెనక్కి వెళ్తుంది. రాత్రి 10 గంటల తర్వాత మాత్రం అక్కడ భక్తులు ఉండటానికి వీళ్లేదు. ఆలయ సిబ్బంది రాత్రి 10 గంటలలోపు అందరు భక్తులు వెళ్లిపోయేలా జాగ్రత్త పడతారు. ఇదండీ ఈ అద్భుతమైన శివాలయం వింతలు, విశేషాలు. మీ ఆర్టికల్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.