సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏ విషయం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే, దీనితో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వార్తలు నిజమా? కాదా? అని నిర్థారణ చేసుకోకముందే చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫేక్ వార్తల గొడవ మరింత ఎక్కువవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ‘అసని’ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సము అందరకి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా గతేడాది చోటుచేసుకున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. ‘అసని’ తుఫాన్ కారణంగా ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి.. గతేడాది మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం అందరకి తెలిసిందే. అయితే.. అప్పట్లో రాయఘడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. రాయఘడ్ జిల్లాలో ఎప్పటిలానే ఆ రోజు కూడా ఆర్టీసీ సర్వీస్ లు మొదలయ్యాయి. కానీ.., భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు నిండిపోయాయి. వరద నీరు వంతెనల పై నుండి ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆర్టీసీ బస్ కూడా వంతెన ముందు ఆగిపోయింది. ప్రవాహం ఉదృతి ఎక్కువగా ఉండటంతో మిగతా వాహనాలు కూడా ఆ వంతెన ముందు ఆగిపోయాయి.
ఇది కూడా చదవండి: Asani Cyclone: అసని తుపానులో మచిలీపట్నం తీరప్రాంతం అంటూ చెబుతున్న ఈ వీడియో ఎప్పటిదంటే!
కానీ.., ఆ బస్ డ్రైవర్ మూర్ఖంగా బస్సుని వంతెనపైకి పంపించాడు. బస్సులో జనం వద్దు అంటున్నా అతను ఎవరి మాట లెక్క చేయలేదు. అలానే వంతెన పై నుండి బస్సుని రోడ్ దాటించాడు. నిజానికి ముందుకి పోవడం ప్రమాదం అనిపించినప్పుడు డ్రైవర్ బస్సుని అక్కడే ఆపేసి అధికారులకి సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ.., ఈ డ్రైవర్ మాత్రం అంత మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం అప్పట్లో వివాదాన్ని రేపింది. అప్పటి వీడియోను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ‘అసని’ తుఫాన్ కారణంగా జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ‘అసని’ తుఫాన్ కారణంగా అంత పెద్ద ఘటనలు ఏవీ జరగలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.